విశ్వంభర బిజినెస్.. శాటిలైట్ - ఓటీటీ రైట్స్ ఎవరికంటే?
టీజర్, ‘రామా రామా’ పాటకు వచ్చిన స్పందన చూస్తే, సినిమా ఎంతలా అందరినీ ఆకట్టుకుంటుందో ఇప్పటికే స్పష్టమవుతోంది.
By: Tupaki Desk | 18 Jun 2025 3:29 PM ISTమెగాస్టార్ చిరంజీవి అభిమానులలో ఎంతగానో ఆసక్తిగా పెంచుతున్న సినిమా ‘విశ్వంభర’. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘బింబిసార’తో హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. చిరు కెరీర్‌లో ఓ విభిన్న ప్రయోగంగా నిలిచే చిత్రంగా ఈ సినిమాకు ప్రచారం జోరుగా సాగుతోంది.
టీజర్, ‘రామా రామా’ పాటకు వచ్చిన స్పందన చూస్తే, సినిమా ఎంతలా అందరినీ ఆకట్టుకుంటుందో ఇప్పటికే స్పష్టమవుతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ తో కలిసి ఇది ఓ మ్యూజికల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందనే అభిప్రాయం అభిమానులలో నెలకొంది. కథ, స్క్రీన్‌ప్లే, విజువల్స్ అన్నీ భారీగా ఉండేలా మేకింగ్ జరగడంతో ఈ సినిమాపై ట్రేడ్ లోనూ ఆసక్తి పెరిగింది.
తాజాగా ‘విశ్వంభర’ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులపై క్లారిటీ వచ్చేసింది. జీ తెలుగు ఛానల్ ఈ చిత్రానికి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. అంతేకాదు, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను డిజిటల్‌గా స్ట్రీమ్ చేసేందుకు హక్కులను దక్కించుకుంది. ఇది ఓ ఫ్యాన్సీ డీల్‌గా టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే సినిమా గ్రాఫిక్స్ వర్క్ దాదాపుగా 90 శాతం పూర్తయిందని, కచ్చితమైన విజువల్ ట్రీట్ కావాలన్న ఉద్దేశంతో హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు కూడా ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాయని సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గ్రాఫిక్స్ కోసం రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటువంటి భారీ స్థాయి చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఇంత త్వరగా, పెద్ద ధరకు అమ్ముడవడం మెగాస్టార్ కు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, అశికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. చిరు గత జన్మ, ఆధునిక కాలానికి సంబంధించి మిస్టరీ అంశాలతో సినిమా ఆసక్తికరంగా రూపొందుతోందని సమాచారం. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. మొత్తంగా చూస్తే ‘విశ్వంభర’ ప్రీ రిలీజ్ బిజినెస్ దశలోనే సత్తా చాటుతోంది. ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా ఇదే స్థాయిలో క్లిక్కవుతుందో లేదో చూడాలి.
