Begin typing your search above and press return to search.

లేటు వయసులో సూపర్‌ స్టార్‌ కిడ్‌ ఎంట్రీ కోసం..!

ఇప్పుడు ఆయన కూతురు విస్మయ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఆ విషయాన్ని మోహన్‌ లాల్‌ ప్రకటించాడు.

By:  Tupaki Desk   |   2 July 2025 4:28 PM IST
లేటు వయసులో సూపర్‌ స్టార్‌ కిడ్‌ ఎంట్రీ కోసం..!
X

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఆయన ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు సినిమాలను హీరోగా చేస్తూ ప్రేక్షఖుల ముందుకు తీసుకు వస్తున్నాడు. మోహన్‌ లాల్‌కి కేవలం మలయాళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అలాంటి మోహన్‌ లాల్‌ తన వారసులను ఇండస్ట్రీలో పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన తనయుడు ప్రణవ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హృదయం సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రణవ్‌కి మంచి పేరు లభించింది. ఇప్పుడు ఆయన కూతురు విస్మయ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఆ విషయాన్ని మోహన్‌ లాల్‌ ప్రకటించాడు.

సాధారణంగా హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకున్న స్టార్‌ కిడ్స్ చిన్న వయసులోనే ఎంట్రీ ఇస్తారు. కానీ విస్మయ మాత్రం మూడు పదుల వయసు దాటిన తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది. ఆ మధ్య విస్మయ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కానీ విస్మయ ఆ సమయంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు విస్మయ 'తుడక్కమ్‌' అనే సినిమాలో నటించేందుకు రెడీ అయింది. మోహన్ లాల్‌ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. డియర్‌ మాయ కుట్టీ తుడక్కమ్‌ సినిమాతో నువ్వు వేయబోతున్న అడుగులు సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

ఆశీర్వాద్‌ సినిమాస్‌ బ్యానర్‌లో ఈ సినిమాను మోహన్‌ లాల్‌ ఆప్తమిత్రుడు ఆంటోనీ పెరువంబూర్‌ నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు జూడ్ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాను ప్రకటిస్తూ మోహన్‌ లాల్‌ ఒక పోస్టర్‌ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. అంతే కాకుండా సినిమా గురించిన విషయాలను మేకర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ సినిమా గురించి ఒక ప్రకటన విడుదల చేశాడు. మోహన్‌ లాల్‌ కూతురును ఇండస్ట్రీలో పరిచయం చేయబోతున్న నేపథ్యంలో తనకు చాలా సంతోషంగా ఉందని, మోహన్‌ లాల్‌ గారు తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

సినిమాల్లో నటించడం కోసం విస్మయ ఏకంగా 22 కేజీల బరువు తగ్గిందని మలయాళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో విస్మయ ఫోటోలను చూస్తే చాలా బొద్దుగా ఉన్నట్లు అనిపించేంది. కానీ ఇప్పుడు ఆమె చాలా సన్నగా, నాజూకుగా కనిపిస్తుంది. తక్కువ సమయంలోనే సినిమా కోసం ఏకంగా 22 కేజీల బరువు తగ్గిన విస్మయ పట్టుదలను చూసి అంతా కూడా వావ్‌ అంటున్నారు. తక్కువ సమయంలోనే అంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సినిమాలపై ఆమెకు ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో విస్మయ సినిమా ఎంట్రీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఈమెకు ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది చూడాలి.