విశ్వరూపం-3 కి విశ్వనటుడు సన్నాహాలా?
పహాల్గాం లో ఉగ్రమూకలు సృష్టించిన నరమేధానికి భారత్ ప్రతి చర్యలకు రెడీ అవుతోంది.
By: Tupaki Desk | 25 April 2025 10:30 PMపహాల్గాం లో ఉగ్రమూకలు సృష్టించిన నరమేధానికి భారత్ ప్రతి చర్యలకు రెడీ అవుతోంది. పాకిస్తాన్ ఉగ్రమూకలపై ముప్పేట దాడికి సర్వం సిద్దం చేస్తోంది. ఉగ్రమూకల చావు ప్రపంచ చరిత్రల్లో నిలిచి పోయేలా ఉంటుందని మోదీ, షా హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నా? మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో `విశ్వరూపం 3` కాన్సెప్ట్ తెరపైకి రావడం సంచలనంగా మారింది.
ఉగ్రవాదాన్ని బేస్ చేసుకుని విశ్వనటుడు కమల్ హాసన్` విశ్వరూపం` చిత్రాన్ని రెండు భాగాలు గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద సంస్థలు ఎలా పని చేస్తాయి? ఉగ్రవాదులు ఎలా తయార వుతారు? రక్తంలో కలిసిన మతం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందన్నది కళ్లకు కట్టారు. విశ్వరూపం మొదటి భాగం మంచి విజయం సాధించింది. దీంతో `విశ్వరూపం 2`కి చాలా సమయం తీసుకుని తెరకెక్కించిన మొదటి భాగంలా రెండవ భాగం సక్సెస్ అవ్వలేదు.
అక్కడితో విశ్వరూపంకి కమల్ హాసన్ పుల్ స్టాప్ పెట్టారు. రెండవ భాగం హిట్ అయితే? కొనసాగింపు గా మూడవ భాగం కూడా తెరకెక్కించే అవకాశాలుంటాయని రిలీజ్ కు ముందు ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను కమల్ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి భారీ బడ్జెట్ తో చేసారు. ఉగ్రవాదం గురించి ప్రపంచానికి తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని అప్పట్లో కమల్ మీడియా సమావేశాల్లో వ్యాఖ్యానించారు.
అయితే తాజాగా `విశ్వరూపం 3` తెరకెక్కించే పునరాలోచనలో కమల్ ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. భారీ కాన్వాస్ పై ఈ చిత్రాన్ని స్వీయా దర్శకత్వంలో నిర్మించాలని ఆలోచన చేస్తున్నారుట. దీనికి సంబంధించి ఎలాంటి స్క్రిప్ట్ సిద్దమవ్వలేదని...రెండవ భాగం ముగింపు నుంచే మూడవ భాగం కథ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. పహాల్గామ్ ఘటన తర్వాత విశ్వరూపం 3 తెరపైకి రావడం నెట్టింట సంచలనంగా మారింది.