VFXలో అంత పెద్ద మాఫియా ఏల్తోందా?
తన సినిమాలు `కార్తికేయ 2, బ్రో` విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. ముఖ్యంగా కార్తికేయ 2 పతాక సన్నివేశాల్లో ద్వారక మునిగిపోయే
By: Tupaki Desk | 8 Aug 2025 2:01 AM ISTప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ రాజ్యమేలుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద పాన్ ఇండియా మార్కెట్ కలిగి ఉన్న పరిశ్రమ. ఇక్కడ పెద్ద సినిమాలు, అసాధారణ బడ్జెట్‌లతో తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్‌ని మించి మన నిర్మాతలు సాహసాలు చేస్తున్నారు. హాలీవుడ్ సాంకేతిక ప్రమాణాలతో సినిమాలు తీయడం ఇప్పుడు రొటీన్‌గా మారింది. ముఖ్యంగా గ్రాఫిక్స్- వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత అసాధారణంగా పెరిగింది. దీంతో పాటే వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్లకు కూడా డిమాండ్ పెరిగింది.
వీళ్లు ప్రమాదకర వ్యక్తులు..
అయితే సరిగ్గా ఇదే పాయింట్‌ని వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్లు తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. నాణ్యమైన ఉత్పత్తిని అందించకుండా అంతగా నాలెజ్ లేని దర్శకులను మ్యానేజ్ చేస్తూ సరైన ఔట్ పుట్ ఇవ్వకుండా, డబ్బులు దండుకుంటున్నారని ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఆరోపించారు. వీఎఫ్ఎక్స్ నిపుణులతో ఆయన ఎంతగా విసిగిపోయారో ఏమో కానీ, అతడు తన స్వీయానుభవాల దృష్ట్యా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ అంటే టెర్రరిస్ట్ అని.. నొటోరియస్ (ప్రమాదకరమైన) అని వ్యాఖ్యానించారు. వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్లు అందరూ అలా ఉంటారని నేను అనడం లేదు.. కొందరు మాత్రం ప్రమాదకరంగా ఉన్నారని విశ్వప్రసాద్ ఆరోపించారు.
ఆ రెండు సినిమాలతో అనుభవాలు:
తన సినిమాలు `కార్తికేయ 2, బ్రో` విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. ముఖ్యంగా కార్తికేయ 2 పతాక సన్నివేశాల్లో ద్వారక మునిగిపోయే సన్నివేశాన్ని మరింత అద్భుతంగా చూపించాల్సింది... కానీ చూపించలేకపోయాం. నేను నాణ్యతకు ఎంత అవసరమో అంత డబ్బు చెల్లించాను. కానీ ఔట్ పుట్ మాత్రం వందశాతం ఇవ్వలేదు... అని అన్నారు. అంతేకాదు.. బ్రో విషయంలో వీఎఫ్ఎక్స్ ఔట్ పుట్ తీసుకోవడంలో కూడా సంతృప్తి లేదని అన్నారు. సముదిరకని లాంటి దర్శకుడికి అంతగా వీఎఫ్ఎక్స్ నాలెజ్ ఉండదని, అలాంటి వారు వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్లపైనే ఆధారపడాల్సి ఉంటుందని కూడా అన్నారు. దర్శకులను మ్యానేజ్ చేసి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్లు కొందరు పబ్బం గడిపేస్తారని కూడా విశ్వప్రసాద్ ఆరోపించారు. సినిమాటోగ్రఫీ విభాగంలోను మాఫియా ఉందని ఆయన చేసిన వ్యాఖ్య నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇదొక్కటే కాదు చాలా శాఖల్లో కీలక వ్యక్తుల వ్వవహారంపై డౌట్లు పుట్టించారు విశ్వప్రసాద్.
