Begin typing your search above and press return to search.

విశ్వంభర: మరో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ గర్ల్ ఎవరంటే?

అయితే ఈ సినిమాలో త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని అనేక రోజులుగా టాక్ వస్తోంది. సీతారామం బ్యూటీ మృణాల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   21 Feb 2024 10:30 AM GMT
విశ్వంభర: మరో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ గర్ల్ ఎవరంటే?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా డేట్ ను సంవత్సరం ముందే ప్రకటించేశారు. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై రోజురోజుకూ హైప్ క్రియేట్ అవుతోంది.

ఇక ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సెట్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. చిరు, త్రిష కలిసి 18 ఏళ్ల క్రితం స్టాలిన్ సినిమాలో నటించారు. మళ్లీ ఇప్పుడు విశ్వంభర కోసం జతకట్టారు. అయితే ఈ సినిమాలో త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని అనేక రోజులుగా టాక్ వస్తోంది. సీతారామం బ్యూటీ మృణాల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. నాని జెంటిల్ మన్ మూవీ, ఒక్క క్షణం, బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సురభి.. విశ్వంభరలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ఓ కీలకపాత్రలో ఆమె సందడి చేయనుందట. ఈ విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వనుందట.

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి సంయుక్తంగా విశ్వంభర సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హర్షవర్ధన్, ప్రవీణ్, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ బియాండ్ యూనివర్స్ అంటూ మేకర్స్ ముందు నుంచి ప్రమోట్ చేస్తున్నారు. విశ్వంభర మూవీ అంతా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇటీవల విశ్వంభర మూవీ ఓటీటీ రైట్స్ డీల్ రూ.18 కోట్లకు కుదిరినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చిరంజీవి పట్టుదలగా ఉన్నారు. ఆయన నటించిన చివరి మూవీ భోళా శంకర్.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజైనా. ఆకట్టుకోలేకపోయింది. దీంతో విశ్వంభర మంచి హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.