విశ్వంభర: మెగాస్టార్ చుట్టూ హనుమంతుల సందడి
ఇదే క్రమంలో మేకర్స్ ఇప్పుడు ఓ స్పెషల్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. మెగాస్టార్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
By: Tupaki Desk | 10 April 2025 8:12 AMమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ విజువల్ వండర్ మూవీ ‘విశ్వంభర’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. పౌరాణిక నేపథ్యంతో పాటు ఎమోషనల్ యాక్షన్ టచ్ తో రానున్న ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న బజ్ వేరే లెవల్లో ఉంది. బింబిసారతో ఆకట్టుకున్న దర్శకుడు వశిష్ఠ మళ్లీ తన క్రియేటివ్ విజన్‌తో మెగాస్టార్‌ని మరోసారి కొత్తగా చూపించబోతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీడియోకు విశేష స్పందన లభించింది. చిరు లుక్, నేపథ్యం, విజువల్స్ అన్నీ కలిపి అభిమానుల్ని ఫిదా చేశాయి.
ఈ గ్రాండ్ స్కేల్ ఫిల్మ్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నెమ్మదిగా ప్రమోషన్ విషయంలో హైప్ పెంచుకుంటోంది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో మేకర్స్ ఇప్పుడు ఓ స్పెషల్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. మెగాస్టార్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
‘విశ్వంభర’ చిత్రం నుంచి వచ్చే తొలి పాట పేరు ‘రామా రామా’. మేకర్స్ దీన్ని ఏప్రిల్ 12న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్‌లో చిరంజీవి చుట్టూ చిన్న పిల్లలు హనుమాన్ గెటప్‌లో కనిపిస్తూ ఎంతో ఎనర్జీని క్రియేట్ చేశారు. చిరంజీవి పై ఓ చిన్నారి కూర్చొని కనిపించగా.. చిరు నవ్వుతూ ఆయన చుట్టూ ఉన్న హనుమంతుల గెటప్‌లో పిల్లలతో సరదాగా కనిపించడం అభిమానుల హృదయాలను హత్తుకుంది.
ఈ లుక్ చూస్తుంటే చిరంజీవి మళ్లీ తన చైల్డ్‌లైక్ ఎనర్జీని తెరపై చూపించనున్నట్టు అర్థమవుతోంది. ఈ పాటకు సంగీతం అందించడంలో ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి తన మార్క్ వినిపించనున్నాడు. పాట విజువల్ గా కూడా భక్తిశ్రద్ధలతో కూడిన దివ్య అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటలో విజువల్స్, డాన్స్, డిజైన్ అన్నీ ఓ ఆధ్యాత్మికతను ఆవిష్కరించేలా ఉండబోతున్నాయని చెబుతున్నారు. చిరంజీవి అభిమానులకే కాకుండా సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఈ పాట ఎమోషన్‌ను రేకెత్తించనుంది.
ఇప్పటివరకు పోస్టర్స్, గ్లింప్స్ మాత్రమే విడుదలైనా, ఈ ఫస్ట్ సింగిల్‌తో సినిమా ప్రమోషన్లు పూర్తి స్థాయిలో షురూ కానున్నాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ రేంజ్‌లో నిర్మిస్తోంది. విజువల్ గ్రాండియర్ పరంగా హై లెవెల్ విజువల్స్ ఉండబోతున్నాయని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. డివైన్ యాక్షన్ డ్రామా కోణంలో రూపొందుతున్న ఈ సినిమా కథాంశం కూడా ఆధ్యాత్మికతకు దగ్గరగా సాగనుందని సమాచారం. ఇక ఈ ఏడాది జూన్ లోనే సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏప్రిల్ 12న రానున్న ‘రామా రామా’ పాట తర్వాత ‘విశ్వంభర’పై అంచనాలు మరింతగా పెరిగేలా ఉన్నాయంటే సందేహమే లేదు. మరి రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.