Begin typing your search above and press return to search.

‘విశ్వంభర’కు ఇది ప్లస్సా మైనస్సా?

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ మొదలైనపుడు ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 April 2025 3:00 AM
‘విశ్వంభర’కు ఇది ప్లస్సా మైనస్సా?
X

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ మొదలైనపుడు ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకుడు కావడం.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ కథ కావడం.. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. చిరుకు సెకండ్ ఇన్నింగ్స్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని దీని మీద అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ టీజర్ రిలీజయ్యాక మొత్తం కథ మారిపోయింది. అందులో పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్, విజువల్స్ చూశాక సినిమా చుట్టూ నెగెటివిటీ ముసురుకుంది. దీంతో అప్పటిదాకా రెడీ అయిన విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్ అంతా పక్కన పెట్టి కొత్తగా వర్క్ చేయాల్సి వచ్చింది. ఈ కారణంగానే సినిమా నిరవధికంగా వాయిదా పడింది.

అసలు వార్తల్లో లేకుండా పోయిన ‘విశ్వంభర’ను మళ్లీ ప్రేక్షకుల దృష్టిలోకి తేవడానికి, హైప్ పెంచడానికి ప్రయత్నిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఇటీవల తొలి పాటను రిలీజ్ చేశారు. ఐతే అది యావరేజ్ అనిపించింది. తాజాగా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ గురించి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఏకంగా రూ.75 కోట్లు ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఒకప్పుడు ఇలా వీఎఫెక్స్ బడ్జెట్ గురించి వెల్లడిస్తే ఆశ్చర్యపోయి దాని గురించి చర్చించుకునేవారు జనం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బాహుబలి, కల్కి సహా పలు భారీ చిత్రాల్లో హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని ఎఫెక్ట్స్ చూసేశారు ప్రేక్షకులు.

పైగా ‘విశ్వంభర’ వీఎఫెక్స్ ఖర్చు ఈ స్థాయికి వెళ్లడం వెనుక వేరే కారణాలున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. ముందు రూపొందించిన వీఎఫెక్స్ కంటెంట్ అంటే పక్కన పడేసి మళ్లీ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ బాగా పెరిగిందని భావిస్తున్నారు. కాబట్టే వీఎఫెక్స్ బడ్జెట్ ఇంత భారీగా అయిందంటే ప్రేక్షకుల్లో పెద్దగా ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. కాబట్టే ఈ 75 కోట్ల వీఎఫెక్స్ బడ్జెట్ వార్త ప్లస్ అవుతుందని చెప్పలేని పరిస్థితి.