Begin typing your search above and press return to search.

'నేను దొంగను కాదు.. ఆయన వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే'

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య గతేడాది ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Feb 2024 12:30 AM GMT
నేను దొంగను కాదు.. ఆయన వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే
X

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య గతేడాది ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్, విశ్వక్ జోడీగా ప్రారంభమైన సినిమా విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయాలు భేదాలు వచ్చి, ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ మేరకు అర్జున్ ప్రెస్‌ మీట్‌ పెట్టి, విశ్వక్‌ సేన్‌ కమిట్‌మెంట్‌ లేని యాక్టర్ అని ఆరోపించడం అప్పట్లో కొన్నాళ్లపాటు హాట్ టాపిక్ గా నడిచింది. దీనిపై అప్పట్లోనే వివరణ ఇచ్చిన విశ్వక్.. తాజాగా ఓ ఇంటర్వూలో ఆ వివాదంపై స్పందించారు. తనకు ఆ డ్యామేజ్ ఎందుకు జరిగిందో తెలుసు కాబట్టే చాలా స్ట్రాంగ్ గా ధైర్యంగా ఉన్నానని అన్నారు. తనకు జరిగింది వేరే బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలకి జరిగితే ఏమయ్యేదని ప్రశ్నించారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ''నాకు జరిగింది ఒక లెగసీ ఉన్న పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మనవడో కొడుకుకో జరిగితే? నేను ఆ సినిమాని క్యాన్సిల్ కూడా చెయ్యలేదు. ఒక్క రోజు షూటింగ్ ఆపమని అడిగాను. ఎందుకంటే నాకు కొంచం క్లారిటీ కావాలనిపించింది. మ్యూచ్యువల్ గా చేసుకుందాం అనే కమిట్ మెంట్ తో ఆ సినిమా ఒప్పుకున్నా. ఆయన మా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలను రిక్వెస్ట్ చెయ్యడం లాంటివి చాలా జరిగాయి. అది ఎవరికీ తెలియదు. కానీ ఈ బచ్చాగాడు ఎవడు, వీడికి బ్యాగ్రౌండ్ కూడా లేదు, వీడు నా షూటింగ్ ఒక రోజు ఆపడం ఏంటి? అని బీపీ తెచ్చుకొని ప్రెస్‌ మీట్‌ పెట్టారు. కానీ నేను ఆ వివాదాన్ని లాగలేదు. తర్వాత దాని గురించి రియాక్ట్ అవ్వడం మానేసాను. ఒక చెడ్డ సినిమా కంటే ఒక చెడ్డ రోజు మంచిది అని డిసైడ్ అయ్యాను''

''నేను ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోలేదు. దేవుడికి నేను ఆ ప్రాజెక్ట్ చెయ్యడం ఇష్టంలేదేమో. నేను ఒక రోజు షూటింగ్ ఆపమంటే, ఆయన డైరెక్ట్ సినిమానే ఆపేసిండు. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న డబ్బులకు రెట్టింపు వెనక్కి ఇచ్చేశా. నేను దొంగను కాదు. అందుకే ఆ భారం ఏమీ లేకుండా దర్జాగా ఉన్నా. సరే, ఆయనకు ఇన్స్టెంట్ గా కోపం వచ్చి ప్రెస్ మీట్ మీట్ పెట్టిండు. చెడ్డ పేరు వచ్చింది నాకే. ఎక్కువ నష్టపోయింది నేనే. కానీ ఏం చెయ్యలేం కదా.. ఎందుకంటే నా మీద ఈజీగా నోరు పారేసుకోవచ్చు. అదే బ్యాగ్రౌండ్ ఉన్న హీరో అయితే వేరే ఉంటది''

''నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఫలానా హీరోలకు వస్తే అలాంటి రియాక్షనే వస్తుందా? ఆ ఫ్యామిలీలో పుట్టడం వాళ్ళ తప్పు కాదు.. అయినా సరే నేను చేసిన మిస్టేక్ ఆ ఫ్యామిలీ హీరోలు చేస్తే, నిజంగా ఇంతే ధైర్యంగా వాళ్ళని అనగలరా? అనరు. రిలేషన్ షిప్ మెయింటైన్ చేసుకోడానికి మా డాడీ సూపర్ స్టార్ కాదు.. మా తాత పెద్ద ప్రొడ్యూసర్ కాదు కదా. నేను పోగొట్టుకోడానికి కూడా ఏమీ లేదు. అవమానిస్తే వాడు రియాక్ట్ అవుతాడు, ఇంకొంచం అటెన్షన్ ఎక్కువ వస్తుందని అర్థమైపోయింది. నేను రియాక్ట్ అయినా వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే నేను రియాక్ట్ అవడం కూడా మానేసాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇదంతా నా ఎదుగుదలలో ఒక భాగం అని నేను రియలైజ్ అయ్యాను'' అని అన్నారు.

కాగా, విశ్వక్ సేన్ ఈ సినిమా విషయంలో తనని తన టీమ్ మొత్తాన్ని అవమానించాడని అర్జున్ అప్పట్లో ఆరోపించారు. అతని కారణంగా రెండు సార్లు షెడ్యూల్ వాయిదా వేసుకున్నామని.. అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉదయం షూటింగ్ అనుకుంటుండగా, క్యాన్సిల్ చేయమని మార్నింగ్ మెసేజ్ పెట్టాడని చెప్పారు. అది తాను జీర్ణించుకోలేకపోయానని, విశ్వక్ కు కమిట్ మెంట్ లేదని, మరీ ఇంతా అన్ ప్రొఫెషనలిజమా అని అర్జున్ వ్యాఖ్యానించారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఇప్పటివరకూ ఒకరి మీద కూడా ఇలా ఆరోపణలు చేయలేదని.. ఇప్పుడు కూడా తన బాధ చెప్పుకోడానికి మాత్రమే వచ్చానన్నారు.

ఇదే విషయం మీద హీరో విశ్వక్ సేన్ స్పందిస్తూ.. తాను నటించే సినిమాకు సంబంధించిన అన్ని పనులు చూసుకుంటానని, తనంత కమిటెడ్ ప్రొఫెషనల్ నటుడు ఉండడని అన్నారు. తన వల్ల ఇప్పటివరకూ ఏ నిర్మాత బాధపడలేదని, సెట్ లోని ఒక్క లైట్ బాయ్ అయినా నన్ను ప్రొఫెషనల్ యాక్టర్ కాదంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని అన్నారు. కళ్లు మూసుకుని కాపురం చెయ్ అంటే, షూట్ కి బయలుదేరే ముందు భయమేసిందని.. అందుకే ఆ ఒక్క రోజు షూట్ క్యాన్సిల్ చేసి కొన్ని విషయాలపై డిస్కస్ చేద్దామని మెసేజ్ పెట్టినట్లుగా విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.