లైఫ్ లో ఎన్నో జరిగాయి.. అందులో ఇది ఒకటి మాత్రమే!
యాక్షన్ కింగ్ గా తెలుగు ఆడియన్స్ ను అలరించిన అర్జున్ ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్నారు. 45 ఏళ్ల కెరీర్లో ఆయనెన్నో సినిమాలు చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Feb 2026 11:02 PM ISTయాక్షన్ కింగ్ గా తెలుగు ఆడియన్స్ ను అలరించిన అర్జున్ ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్నారు. 45 ఏళ్ల కెరీర్లో ఆయనెన్నో సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన తన కూతురు ఐశ్వర్యా అర్జున్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఐశ్వర్యా అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో జరిగిపోవాల్సింది. కానీ ఎన్నో ఆటంకాలు, ఇబ్బందుల తర్వాత ఇప్పుడు దానికి ముహూర్తం కుదిరింది.
ఐశ్వర్యా అర్జున్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి అర్జున్ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావని రీసెంట్ గా ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తెలుస్తోంది. దాని కోసం కథ రాసుకుని తన దర్శకత్వంలోనే ఆ మూవీని తెరకెక్కించాలనుకున్నారు. కానీ కొన్ని విషయాల వల్ల తన కూతురి టాలీవుడ్ డెబ్యూ ఆలస్యమైందంటున్నారు. అయితే ఐశ్వర్యా అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ లేటవ్వడానికి పలు కారణాలుంటే అందులో విశ్వక్ సేన్ మెయిన్ రీజన్.
విశ్వక్ హీరోగా మొదలైన ప్రాజెక్టు
వాస్తవానికి అర్జున్ దర్శకత్వంలో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా, విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీ అనుకున్నారు. అంతా ఓకే అనుకుని సినిమా మొదలై, సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి విశ్వక్ బయటకు రావడంతో అర్జున్ కు అసలు తలనొప్పి మొదలైంది. ఎప్పుడైనా సరే ఒకరు మొదలుపెట్టిన పనిలోకి మరొకరు రావడానికి ఇష్టపడరు. ఇండస్ట్రీలో సినిమా విషయంలో కూడా అంతే.
విశ్వక్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తర్వాత తాను పలువురు హీరోలను కలిశానని, కానీ ఆల్రెడీ ఓ హీరో తప్పుకున్న ప్రాజెక్టు కావడంతో దీన్ని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, తాను కూడా వాళ్లను ఇబ్బంది పెట్టదలచుకోలేదని చెప్పారు అర్జున్. ఆఖరికి ఆరేడు నెలల తర్వాత ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా ఈ మూవీని పట్టాలెక్కించామని అర్జున్ చెప్పారు.
ఫంకీతో పోటీగా సీతా పయనం
అయితే నిరంజన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత సినిమాలో హీరో పాత్రకు అతను తప్పించి మరెవరూ న్యాయం చేయలేకపోయేవారేమో అనిపించిందని, అందుకే ఏం జరిగినా మంచిదేనని అర్జున్ చెప్పారు. ఇక విశ్వక్ సేన్ తో వివాదం గురించి మాట్లాడుతూ, తన లైఫ్ లో ఎన్నో జరిగాయని, అందులో ఇది ఒకటి మాత్రమేనని, మనుషులందరూ ఒకేలా ఉండరని అన్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చిన విశ్వక్ ఫంకీ మూవీకి పోటీగానే అర్జున్ ఇప్పుడు సీతాపయనం మూవీని రిలీజ్ చేస్తుండటం విశేషం. ఫంకీ మూవీ ఫిబ్రవరి 13న రిలీజ్ కానుండగా, సీతా పయనం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. మరి వీరిద్దరిలో వచ్చే వారం విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
