Begin typing your search above and press return to search.

'విష్ణు విన్యాసం' మూవీ రివ్యూ

మరి మరోసారి విష్ణు విన్యాసం పని చేసిందా? ప్రేక్షకులకు వినోదం పంచిందా? తెలుసుకుందాం పదండి.

By:  Tupaki Desk   |   27 Feb 2026 2:55 PM IST
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ
X

'విష్ణు విన్యాసం' మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ విష్ణు- నయన్ సారిక- సత్య- బ్రహ్మాజీ- గోపరాజు రమణ- శ్రీకాంత్ అయ్యంగార్- మురళీ శర్మ- శ్రీనివాసరెడ్డి- సత్యం రాజేష్ తదితరులు

సంగీతం: రధన్

ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్

నిర్మాత: సుమంత్ నాయుడు

రచన-దర్శకత్వం: యదునాథ్ మారుతీరావు

వినోదాత్మక చిత్రాలతో యువతలో.. కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన యువ నటుడు శ్రీ విష్ణు తన స్టయిల్లోనే చేసిన కొత్త చిత్రం 'విష్ణు విన్యాసం' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మరోసారి విష్ణు విన్యాసం పని చేసిందా? ప్రేక్షకులకు వినోదం పంచిందా? తెలుసుకుందాం పదండి.

కథ: విష్ణు (శ్రీ విష్ణు) ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్. అతడికి జాతకాల పిచ్చి. అడుగు తీసి అడుగు వేయాలన్నా జ్యోతిషుడి సలహా తీసుకుంటాడు. దీని వల్లే అతడికి 30 ఏళ్లు దాటినా పెళ్లవదు. తనకు తగిన అమ్మాయి కోసం చూస్తున్న అతడికి.. తన కాలేజీలోనే లెక్చరర్ అయిన మనీషా (నయన్ సారిక)తో పరిచయం అవుతుంది. కొంచెం విచిత్రంగా ప్రవర్తించే ఆమె.. త్వరగా విష్ణుకు దగ్గరవుతుంది. మనీషాను పెళ్లి చేసుకోవడానికి ఉత్సాహంగా సిద్దమైపోయిన విష్ణుకు.. తన గురించి ఒక ఆశ్చర్యకర విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి.. అది తెలిశాక విష్ణు ఎలా స్పందించాడు.. చివరికి విష్ణు, కలిసి జీవితాన్ని పంచుకున్నారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: కథనం- విశ్లేషణ: కామెడీ పరంగా చిన్న హింట్ అల్లుకుపోయే హీరోలు కొందరుంటారు. తమదైన కామెడీ టైమింగ్ తో ఉన్న కంటెంట్ కు కొన్ని రెట్ల ప్రభావం చూపిస్తుంటారు ఇలాంటి హీరోలు. ఈ తరంలో శ్రీ విష్ణు ఆ కోవకు చెందిన నటుడే. హీరోగా కెరీర్ ఆరంభంలో ఎక్కువగా సీరియస్ క్యారెక్టర్లు చేసిన అతను.. ఇప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఈ తరం యువతకు కనెక్టయ్యే టిపికల్ కామెడీ టైమింగ్ అతడి సొంతం. పెద్దగా కథ లేకపోయినా.. తన వరకు ఓ మంచి క్యారెక్టర్.. సరైన కామెడీ సిచువేషన్లు కుదిరాయంటే చాలు.. శ్రీ విష్ణు చెలరేగిపోతాడు. గత ఏడాది 'సింగిల్' మూవీతో అతను ఇలాగే వినోదాన్ని పంచాడు. 'విష్ణు విన్యాసం'లో జాతకాల పిచ్చి ఉన్న కుర్రాడి పాత్ర ఎంటర్టైన్మెంట్ కు మంచి స్కోప్ ఇచ్చేదే. విష్ణు కూడా ఈ పాత్రలో తనదైన శైలిలో కొంతమేర వినోదాన్ని కూడా పంచాడు. కాకపోతే కథలో హీరో కంటే కీలకమైన హీరోయిన్ పాత్రతో ప్రేక్షకులకు షాకిద్దామని ప్రయత్నించిన రైటర్ కమ్ డైరెక్టర్ యదునాథ్ మారుతీరావు.. ఆ పాత్రను తీర్చిదిద్దే విషయంలో గందరగోళానికి గురై ప్రేక్షకులనూ అయోమయానికి గురి చేశాడు. ఇల్లాజికల్ గా- అర్థరహితంగా అనిపించే హీరోయిన్ పాత్ర.. దాని చుట్టూ నడిపిన అస్తవ్యస్తపు కథ 'విష్ణు విన్యాసం'లో శ్రీ విష్ణు ప్రభావాన్ని తగ్గించాయి. శ్రీ విష్ణు నుంచి ఆశించే ఎంటర్టైన్మెంట్ కొంత ఉన్నప్పటికీ.. 'విష్ణు విన్యాసం' ఓవరాల్ ఇంపాక్ట్ ఓ మోస్తరుగా అనిపిస్తుందంతే.

జాతకాల పిచ్చి ఉన్న హీరో.. తన జాతకంలో పెద్ద సమస్య ఉన్న హీరోయిన్.. ఇలాంటి ఇద్దరు కలిస్తే? కామెడీ వర్కవుట్ చేయడానికి మంచి అవకాశమున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇది. ఐతే వినడానికి ఆసక్తికరంగా అనిపించే ఈ పాయింట్ చుట్టూ ఆసక్తికర కథాకథనాలు రాసుకోలేకపోయాడు దర్శకుడు. కథను హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలుపెట్టిన దర్శకుడు.. తన పాత్రను పరిచయం చేసిన తీరు చూస్తే ఎంతో ఊహించుకుంటాం. కానీ తన సమస్య గురించి తెలిశాక దీనికా ఇంత బిల్డప్ ఇచ్చారు అనిపిస్తుంది. జాతకంలో తనకున్న సమస్యను జాతకాల పిచ్చి ఉన్న హీరోతో ముడిపెట్టి దాని మీద కామెడీ నడిపించడం వరకు ఓకే. కానీ హీరో పాత్రను పక్కన పెట్టి చూస్తే.. హీరోయిన్ సమస్య సినిమాలో చూపించినంత తీవ్రమైందైతే కాదు. తన సమస్య గురించి విన్న వాళ్లంతా అంత షాకైపోవడం.. తన కుటుంబ సభ్యులు దాని చుట్టూ అంత రభస- హడావుడి చేయడం.. కనిపించిన వాడినల్లా తనను పెళ్లి చేసుకుంటావా అని హీరోయిన్ అడగడం.. ఇదంతా టూమచ్ గా అనిపిస్తుంది. ఇది చాలదన్నట్లు కథానాయికను చైన్ స్మోకర్ గా.. రోజూ మందుకొట్టే తాగుబోతుగా చూపించడంలో ఆంతర్యమేంటో.. ఈ కథకు దాని అవసరమేంటో అర్థం కాదు. లేడీ క్యారెక్టర్లు ఎప్పుడో ఒకసారి మందు కొట్టినట్లు.. దమ్ము లాగినట్లు చూపిస్తే ఓకే కానీ.. ఇలా వాళ్లను వ్యసనపరులుగా చూపించడాన్ని ప్రేక్షకులు అంగీకరించలేరు. ఎంత బలమైన కారణం చూపించినా.. దాన్ని జీర్ణించుకోలేరు. పైగా ఇందులో ఆ సన్నివేశాలను కన్విన్సింగ్ గా చూపించలేదు. ఇలా హీరోయిన్ పాత్ర ఆద్యంతం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంటుంది.

ఐతే కథానాయిక సంగతి పెట్టి కథానాయకుడికి విషయానికి వస్తే.. శ్రీ విష్ణు మాత్రం తన నుంచి ప్రేక్షకులు కోరుకునేది ఇచ్చేశాడు. బూతు మాటలు హద్దులు దాటకుండా.. కొన్ని మాటలను మింగేస్తున్నట్లుగా టిపికల్ టైమింగ్ తో అతను డైలాగులు చెప్పే తీరు యువ ప్రేక్షకులకు నచ్చుతుంది. తన వన్ లైనర్స్ చాలా వరకు పేలాయి. జాతకాల పిచ్చితో అతను చేసే విన్యాసాలు వినోదాన్ని పంచుతాయి. 'వెంకీ' సినిమాలో జగదాంబ చౌదరి తరహాలో ఒంగోలు చౌదరిగా శ్రీనివాసరెడ్డి పాత్రకు శ్రీ విష్ణుకు మధ్య నడిచే ట్రాక్ బాగుంది. సత్యతో కలిసి కొన్ని చోట్ల శ్రీ విష్ణు చేసిన అల్లరి కూడా ఆకట్టుకుంటుంది. ఐతే ఈ వినోదం ఓ మోస్తరుగా అనిపించినా.. కథ-హీరోయిన్ పాత్ర మాత్రం సినిమా ఫ్లోను దెబ్బ తీస్తుంటాయి. ఆ రెండు లోపాలను మరిపించే స్థాయిలో కామెడీ సిచువేషన్లు మాత్రం దర్శకుడు క్రియేట్ చేయలేకపోయాడు. మీమ్ టెంప్లేట్లు.. ఆ బీజీఎంలు మరీ అతిగా వాడేశారు సినిమాలో. కొన్ని చోట్ల అది అసహనం కలిగిస్తుంది. కథన లోపం వల్ల రెండో అర్ధంలో శ్రీ విష్ణు చేతులు కట్టేసినట్లు అనిపిస్తుంది. కథ.. సన్నివేశాలు మరీ నాన్ సీరియస్ గా తయారై సెకండాఫ్ కొంచెం భారంగా మారుతుంది. చివర్లో ఈ కథకు ఎమోషనల్ టచ్ ఇవ్వాలని చూసినా.. అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు. శ్రీ విష్ణు కోసం 'విష్ణు విన్యాసం' మీద ఓ లుక్కేయొచ్చు కానీ.. ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోవడం మంచిది.

నటీనటులు: 'కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్' అనే ట్యాగ్ కు న్యాయం చేయడానికి శ్రీ విష్ణు శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు. తన వరకు ఏ సన్నివేశంలోనూ నిరాశపరచలేదు. తన కామెడీ టైమింగుకి అభిమానులుగా తయారైన కొత్త తరం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు. శ్రీ విష్ణు రన్నింగ్ కామెంట్రీ ప్రేక్షకులను నవ్విస్తుంది. హీరోయిన్ నయన్ సారిక చూడ్డానికి బాగుంది. తన పెర్ఫామెన్స్ పర్వాలేదు. కానీ దర్శకుడు తన పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగా లేదు. కథానాయికకు అవలక్షణాలు పెట్టడం తప్పు కాదు కానీ.. వాటిని కన్విన్సింగ్ గా చూపించలేకపోవడం మైనస్. సత్య ఓ మోస్తరుగా నవ్వించాడు. తన నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. బ్రహ్మాజీ.. ప్రవీణ్ పెద్దగా ప్రభావం చూపలేదు. శ్రీనివాసరెడ్డి కొన్ని చోట్ల వినోదాన్ని పంచాడు. గోపరాజు రమణ, మురళీశర్మలను సరిగా వాడుకోలేదు. శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదు.

సాంకేతిక వర్గం: 'విష్ణు విన్యాసం'లో సాంకేతిక నిపుణుల పనితీరు ఆశించినంత గొప్పగా లేదు. రధన్ పాటల్లో ఒక్కటీ వినసొంపుగా లేదు. అసలు ఇది తన శైలికి నప్పే సినిమా కాదు. పాటలను మొక్కుబడిగా లాగించేసినట్లు అనిపిస్తుంది. బీజీఎం కూడా చాలా చోట్ల మరీ లౌడ్ అనిపిస్తుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ యదునాథ్ మారుతీరావు.. కామెడీ వర్కవుట్ చేయగలిగే కాన్ఫ్లిక్ట్ ఉన్న కథనే ఎంచుకున్నప్పటికీ.. కథన పరంగా అనుకున్నుంతగా మ్యాజిక్ చేయలేకపోయాడు. కొన్ని చోట్ల కామెడీ.. వన్ లైనర్స్ పని చేశాయి. శ్రీవిష్ణు కామెడీ టైమింగుని వాడుకున్నాడు. కానీ సన్నివేశాలను మరీ లైట్ గా.. లాజిక్ లేకుండా రాసుకోవడంతో సినిమా ప్రభావం తగ్గిపోయింది. పాత్రలు.. సన్నివేశాలు ఇలా ఉంటే ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా అని చూడకుండా రాత-తీత మరీ తేలిగ్గా సాగినట్లు అనిపిస్తుంది.

చివరగా: విష్ణు విన్యాసం.. ఓ మోస్తరు వినోదం

రేటింగ్- 2.5/5