విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది?
తమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి గుర్తింపుతో పాటు మంచి మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్న హీరో విశాల్.
By: Tupaki Desk | 12 May 2025 1:30 PMతమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి గుర్తింపుతో పాటు మంచి మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్న హీరో విశాల్. హిట్, ఫ్లాప్‌లకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రెండు భాషల్లో రిలీజ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఎంగేజ్‌మెంట్, పెళ్లి విషయంలో వార్తల్లో నిలిచిన విశాల్ ఆ తరువాత ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ భారీ నిర్మాణ సంస్థతో తలెత్తిన వివాదం కారణంగా మరోసారి వార్తల్లో కెక్కారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా విశాల్ అనీజీగా కనిపిస్తున్నారు.
పబ్లిక్ మీటింగ్‌లలో, సినిమా ప్రమోషన్‌లలో కనిపించి తన విచిత్రమైన ప్రవర్తనతో అభిమానులతో పాటు సినీ లవర్స్, ఇండస్ట్రీ వర్గాలని షాక్‌కు గురి చేస్తున్నారు. ఆ మధ్య `మదగజరాజా` మూవీ ప్రమోషన్స్ కోసం బయటికొచ్చిన విశాల్ స్టేజ్‌పై వణుకుతూ నిలబడలేని స్థితిలో కనిపించి అందరిని షాక్‌కు గురి చేశారు. విశాల్ స్టేజ్‌పై నిలబడలేక, మాట్లాలేక వణికిపోవడంతో ఒక్కసారిగా విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా ఉన్నాడు. ఎందుకు మునుపటిలా మాట్లాడలేకపోతున్నాడు?.. ఎందుకిలా వణుకుతున్నాడు? అని అంతా భయపడ్డారు.
తాజాగా చెన్నైలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ వేదికపై స్పృహతప్పి పడిపోయిన విషయం తెలిసిందే. చెన్నైలో ఆదివారంరాత్రి ట్రాన్స్ జెండర్లకు నిర్వహించిన `మిస్ కువాగం 2025` పోటీల కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాంగంలోని కూత్తాండవర్ ఆలయంలో చిత్తిరై వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్ ఉన్నట్టుండి వేదికపై సొమ్మపసిల్లి పడిపోయారు.
అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి వెంటనే విశాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన అనంతరం విశాల్ కోలుకున్నారు. తిరిగి సాధారణ స్థితికి వచ్చేశారు. దీనిపై అంతా ఆందోళన వ్యక్తం చేయడంతో విశాల్ టీమ్ స్పందించింది. విశాల్‌పై ఇటీవల ప్రచారంలో ఉన్న వార్తలపై మేము స్పష్టతనివ్వాలనుకుంటున్నాం. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు విశాల్ కొద్దిసేపు అలసటతో మార్చపోయారు. మధ్యాహ్నం తను సాధారణ భోజనం చేయలేదు. కేవలం జ్యూస్ మాత్రమే తీసుకున్నారు. దాంతో శక్తిలేకపోవడంతో స్పృహ తప్పి పడిపోయారు.
ఆ తరువాత వెంటనే హాస్పిట్‌కు తీసుకెళ్లడంతో తేరుకున్నారు. అదృష్టవశాత్తు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారు` అంటూ వివరణ ఇచ్చింది. అయితే గత కొంత కాలంగా విశాల్ ఇలా అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారు? ఆయన ఆరోగ్యం ఎందుకు అప్‌సెట్ అవుతోంది?.. ఆయన ఏమైనా ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్వయంగా విశాల్ వివరణ ఇస్తేకానీ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.