విరోష్ వెడ్డింగ్ షెడ్యూల్ ఇదే!
వీరి పెళ్లి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 24న హల్దీ కార్యక్రమంతో ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి.
By: Sravani Lakshmi Srungarapu | 24 Feb 2026 10:47 AM ISTటాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లి వేడుకలు రాజస్థానీ రాజసంతోషంలో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని పెళ్లితో ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఈ జంట, ఫిబ్రవరి 22న తమ బంధాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ప్రేమతో పిలిచే విరోష్ పేరునే తమ పెళ్లికి ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్‌గా నామకరణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కట్టుదిట్టమైన భద్రత మధ్య పెళ్లి
రాజస్థాన్‌లోని ఎంతో అందమైన ఉదయపూర్‌లోని విలాసవంతమైన ఐటీసీ మెమొంటోస్ రిసార్ట్ లో ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే విజయ్, రష్మిక తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్‌పూర్ చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అతిథుల రాకతో రిసార్ట్ పరిసరాల్లో సందడి మొదలైంది. అంతర్జాతీయ స్థాయి భద్రతా సంస్థను నియమించడంతో ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా, కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది.
మూడు రోజుల పెళ్లి
వీరి పెళ్లి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 24న హల్దీ కార్యక్రమంతో ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఫిబ్రవరి 25న సంగీత్ మరియు మెహందీ కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుగుతుంది. సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున ఆహ్వానాలు పంపకుండా, కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు కలిపి కేవలం 100 మందికే ఆహ్వానం అందించినట్లు సమాచారం. ఈ వేడుకను ప్రైవేట్ ఈవెంట్ గా నిర్వహించాలని విజయ్- రష్మిక మొదటి నుంచి ఎంతో స్ట్రిక్ట్ గా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన జంట
కాగా ఆల్రెడీ ఉదయ్‌పూర్‌కు చేరుకున్న ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. విజయ్ దేవరకొండ స్విమ్మింగ్ పూల్ లో నుంచి దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేయగా, రష్మిక రిసార్ట్‌లోని టేబుల్‌పై ఉన్న స్పెషల్ వెడ్డింగ్ మెనూని షేర్ చేశారు. వాటిని చూసి అభిమానులు కామెంట్ల రూపంలో వారికి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి తర్వాత, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనుందీ జంట. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. మొత్తానికి, విరోష్ వెడ్డింగ్ టాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన ఈవెంట్‌గా నిలవనుంది.
ఇక కెరీర్ పరంగా చూసుకుంటే అటు రష్మిక, ఇటు విజయ్ ఇద్దరూ పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ పాన్-ఇండియా ఇమేజ్‌ను మరింత బలపరుచుకునే ప్రయత్నం చేస్తుండగా, రష్మిక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. పర్సనల్ లైఫ్ లో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న ఈ జంటకు అభిమానులు, సినీ వర్గాలు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.
