నటుడిపై ఫిర్యాదు చేసిన నటి రివర్స్ గేర్
తాజాగా ఓ చానెల్ తో మాట్లాడుతూ.. ఒక నటుడు చేసిన తప్పు ఇప్పుడు మొత్తం సినిమాను ప్రభావితం చేస్తోంది. ఇలా జరగకూడదు.
By: Tupaki Desk | 18 April 2025 6:33 PM ISTప్రముఖ నటి విన్సీ అలోషియస్ సహనటుడు షైన్ టామ్ చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఫిర్యాదును అధికారికంగా కేరళ ఫిల్మ్ ఛాంబర్, అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)కి సమర్పించారు.
టామ్ తానతో అసౌకర్యంగా ప్రవర్తించాడని, రిహర్సల్స్ సమయంలో తెల్లటి పౌడర్ (మాదక ద్రవ్యం)ని సేవిస్తూ కనిపించాడని కూడా ఆరోపించింది. ఇది మరోసారి మాలీవుడ్ కి అతి పెద్ద కుదుపు. విన్సీ అతడిపై ఆరోపించిన అనంతరం నార్కోటిక్స్ బ్యూరో అధికారులు టామ్ ఉంటున్న హోటల్ పై దాడి చేసారు. కానీ షైన్ టామ్ చాకో ఆ హోటల్ గది నుంచి తప్పించుకుని పారిపోయిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు కనుగొన్నట్టు వార్తలొచ్చాయి.
పోలీసులు ఓ వైపు అతడి కోసం వెతుకుతున్నారు. అతడికి నోటీసులు పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు డ్రగ్స్ తో టామ్ కి సంబంధాలేవైనా ఉన్నాయా? అనే కోణంలో ఎన్సీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులంతా అతడి కోసం గాలిస్తున్నారు. ఇంతలోనే నటి విన్సీ ఫిలింఛాంబర్, అంతర్గత కమిటీలకు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
కమిటీల నమ్మక ద్రోహం కారణంగా తాను ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు విన్సీ వెల్లడించారు. నిజానికి ఈ ఫిర్యాదు చేసేప్పుడు తాను నటుడి పేరు బయటకు రాకుండా దర్యాప్తు చేయాలని కమిటీ సభ్యులను కోరినట్టు విన్సీ చెబుతోంది. కానీ షైన్ టామ్ చాకో పేరు బయటకు వచ్చేసింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన విన్సీ ఇప్పుడు ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు వెల్లడించారు. తాజాగా ఓ చానెల్ తో మాట్లాడుతూ.. ఒక నటుడు చేసిన తప్పు ఇప్పుడు మొత్తం సినిమాను ప్రభావితం చేస్తోంది. ఇలా జరగకూడదు. అందుకే నటుడి పేరును బయటకు చెప్పవద్దని అభ్యర్థించానని, అతడు తన తప్పును దిద్దుకోవాలని కోరుకున్నానని విన్సీ చెబుతున్నారు. కానీ తాను కోరుకున్నది జరగలేదు. కేసు చాలా సీరియస్ అయింది. ఇప్పుడు అతడు నటిస్తున్న సినిమాపై ఇది తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ ఆగిపోవడంతో నటి విన్సీ ఆవేదనలో ఉంది.
