టాలీవుడ్ బాలీవుడ్‌లో సైబర్ క్రైమ్ బాధితుల గోడు!
సైబర్ నేరగాళ్లకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా ఏం లేదు. దొరికినంతా దోచుకోవడం వీళ్ల వృత్తి.
By: Sivaji Kontham | 17 Jun 2026 12:43 PM ISTసైబర్ నేరగాళ్లకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా ఏం లేదు. దొరికినంతా దోచుకోవడం వీళ్ల వృత్తి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి చాలా మంది సైబర్ క్రైమ్ బాధితులు బహిరంగంగా తమను దోచేసిన ఘటనల గురించి వెల్లడించారు. వినే కొద్ది ఆన్ లైన్ మోసగాళ్ల నుంచి వింత వినోదాలు బయటపడుతూనే ఉన్నాయి.
బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విక్రాంత్ మాస్సీ. విధూ వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన జాతీయ అవార్డు గెలుచుకున్న `ట్వల్త్ ఫెయిల్` చిత్రంలో విక్రాంత్ ప్రదర్శించిన అద్భుత నటన విమర్శకులతో సైతం ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా తెచ్చిన భారీ విజయంతో బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతుడైన నటుడిగా అతడు స్థిరపడ్డాడు. అయితే కెరీర్ పరంగా ఎంతో పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే... తన కుటుంబం కోసం కొన్నేళ్ల పాటు నటనకు స్వస్తి చెబుతానని ప్రకటించి విక్రాంత్ అందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాడు.
ఇలాంటి తరుణంలో విక్రాంత్ మాస్సీ కుటుంబం ఒక పెద్ద చిక్కుల్లో పడింది. ఇటీవల ఆయన కుటుంబం సైబర్ నేరగాళ్ల బారిన పడి తీవ్రమైన మానసిక ఆందోళనను ఎదుర్కొంది. ఈ విషయాన్ని విక్రాంత్ స్వయంగా వెల్లడిస్తూ, డిజిటల్ యుగంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీల భద్రత కూడా ఎలా ప్రమాదంలో పడుతుందో వివరించాడు. సైబర్ క్రైమ్ ముఠాలు తన కుటుంబాన్ని టార్గెట్ చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సైబర్ దాడిలో భాగంగా విక్రాంత్ మాస్సీ భార్య శీతల్ ఠాకూర్ ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు దొంగతనంగా డబ్బును విత్‌డ్రా చేసుకున్నారు. ఒకసారి కాదు... ఏకంగా రెండుసార్లు ఆమె బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు కట్ అయిందని విక్రాంత్ తెలిపాడు. గుర్తుతెలియని వ్యక్తులు సాంకేతికతను ఆసరాగా చేసుకుని తమ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి.. ఈ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నాడు.
ఈ సంఘటన జరిగిన వెంటనే విక్రాంత్ మాస్సీ ... ఆయన కుటుంబ సభ్యులు అప్రమత్తమై చట్టపరమైన చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, బ్యాంకు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సెలబ్రిటీల కుటుంబాలపై ఇలాంటి డిజిటల్ దాడులు జరగడంపై నెటిజన్లు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా... కేటుగాళ్లు కొత్త దారుల్లో ముంచేస్తున్నారని ఈ ఘటన నిరూపిస్తోంది. ఒకవైపు నటనకు విరామం ఇచ్చి భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడపాలని భావించిన విక్రాంత్‌కు ఈ సైబర్ క్రైమ్ ఉదంతం పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
టాలీవుడ్ లోను బాధితులు!
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఆర్థికంగా నష్టపోయిన వారిలో సామాన్యులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సైతం ఉన్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ క్రెడిట్ కార్డ్ వివరాలను దొంగిలించి లక్షల రూపాయల మోసానికి పాల్పడగా.... నటి కత్రినా కైఫ్, నటుడు అఫ్తాబ్ శివదాసాని వంటి వారు నకిలీ ప్యాన్ కార్డ్ లింకులు, కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌ల ద్వారా ఆన్‌లైన్ మోసగాళ్ల చేతికి చిక్కి తమ బ్యాంకు ఖాతాల నుండి డబ్బు పోగొట్టుకున్నారు. వీరితో పాటు రాజ్ కుమార్ రావు లాంటి మరెంతో మంది స్టార్లు కూడా క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
