Begin typing your search above and press return to search.

మరో సౌత్‌ మూవీ జపాన్‌లో జోరు..!

ఈ మధ్య కాలంలో ఇండియన్‌ సినిమాలకు జపాన్‌లో మంచి మార్కెట్‌ క్రియేట్‌ అయింది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 9:19 PM IST
మరో సౌత్‌ మూవీ జపాన్‌లో జోరు..!
X

ఈ మధ్య కాలంలో ఇండియన్‌ సినిమాలకు జపాన్‌లో మంచి మార్కెట్‌ క్రియేట్‌ అయింది. రాజమౌళి సినిమాలు మాత్రమే కాకుండా ఇండియాలో మంచి విజయానలు సొంతం చేసుకున్న కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు జపాన్‌లో భారీ ఎత్తున విడుదల అయ్యి సూపర్‌ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాటు బాహుబలి సినిమా జపాన్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాలుగా నిలిచాయి. ఇటీవల బలగం, దేవర సినిమాలు సైతం జపాన్‌లో విడుదల అయిన విషయం తెల్సిందే. జపాన్‌లో విడుదల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అందుకే చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ జపాన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

తాజాగా యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ 'విక్రమ్‌' ను జపాన్‌లో విడుదల చేశారు. సాధారణంగా ఇండియన్‌ సినిమాలు జపాన్‌లో విడుదల అయితే ఇక్కడ తెగ హడావుడి ఉంటుంది. కానీ విక్రమ్‌ సినిమా విషయంలో పెద్దగా హడావుడి లేదు, పైగా ప్రమోషన్‌కి ఇక్కడ నుంచి ఎవరూ వెళ్లలేదు. అయినా కూడా జపాన్‌ లో విక్రమ్‌ ఓపెనింగ్‌ బాగా ఉన్నట్లు తెలుస్తోంది. మే 30న విడుదలైన విక్రమ్‌ సినిమా తక్కువ సమయంలోనే 8.4 మిలియన్‌ జపాన్ యెన్స్‌ ను రాబట్టింది. ఇండియన్ కరెన్సీ లో 50 లక్షల రూపాయలను రాబట్టింది. కేవలం 55 స్క్రీన్స్‌ లో విడుదలైన విక్రమ్‌ సినిమాకు అది డీసెంట్‌ ఓపెనింగ్‌గా స్థానిక మీడియా పేర్కొంది.

సినిమా మొదటి వారం రోజులు స్క్రీనింగ్‌ తర్వాత మరో 50 థియేటర్లను పెంచుతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్‌ సినిమాకు జపాన్‌లో వస్తున్న స్పందన నేపథ్యంలో లాంగ్‌ రన్‌లో దాదాపుగా రూ.5 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కమల్‌ రెండు మూడు రోజులు వెళ్లి ప్రమోట్‌ చేస్తే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కానీ కమల్‌ థగ్‌ లైఫ్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటం వల్ల అక్కడికి వెళ్లలేదు. ఇకపై కూడా అక్కడకు వెళ్లే అవకాశం లేదు. కనుక విక్రమ్‌ సినిమా వసూళ్లు ఒక మోస్తరు వరకే రావచ్చు అని కొందరు అంటున్నారు. మొత్తానికి సినిమా లాంగ్‌ రన్‌లో జపాన్‌ నుంచి ఎంత రాబట్టేను అనేది చూడాలి.

విక్రమ్‌ సినిమాకు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించాడు. యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ కెరీర్‌ ఖతం అయింది, ఆయన సినిమాలను వదిలి పెట్టాలి, రాజకీయాలు చూసుకుంటే సరిపోతుంది, సినిమాలు ఆయన చేసినా జనాలు చూడరు అనుకుంటున్న సమయంలో లోకేష్ కనగరాజ్ విక్రమ్‌ సినిమాను చేసి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. ఆ విజయంతో కమల్‌ హాసన్‌ మరోసారి స్పీడ్‌ పెంచాడు. తన సినిమాలను బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. కేవలం విక్రమ్‌ హిట్‌ కారణంగా మూడు నాలుగు సినిమాలను వెంట వెంటనే కమల్‌ కమిట్ అయ్యాడు. తాజాగా థగ్ లైఫ్‌ సినిమాతో కమల్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.