70 రోజుల జైలు..జీవితాన్నే మార్చేసిందన్న డైరెక్టర్!
వైద్య సహాయం అందేలా లేదని గ్రహించిన విక్రమ్ భట్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి స్వయంగా ఆహార నియమాలను మార్చుకున్నారు.
By: Srikanth Kontham | 7 Jun 2026 3:00 PM ISTగ్లామర్ ప్రపంచంలో వెలిగిపోయే సెలబ్రిటీల జీవితాలు ఒక్కోసారి ఊహించని చట్టపరమైన చిక్కుల్లో పడి తలకిందులవుతుంటాయి. వెండితెరపై హారర్ సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టే బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ జీవితంలో కూడా అలాంటి ఓ భయానకమైన నిజ జీవిత ఘటన చోటుచేసుకుంది. ఓ బయోపిక్ నిర్మాణానికి సంబంధించిన 30 కోట్ల ఆర్థిక మోసం ఆరోపణల కేసులో ఆయన దాదాపు 70 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఇలాంటి కఠినమైన కాలంలో తాను ఎదుర్కొన్న భౌతిక నరకాన్ని, అక్కడ తనకు లభించిన మానవత్వాన్ని విక్రమ్ భట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఉదయపూర్ సెంట్రల్ జైలులో గడిపిన ఆ 70 రోజులు తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయని విక్రమ్ భట్ పేర్కొన్నారు. దాదాపు 60 నుండి 80 మంది ఖైదీలు ఉండే ఒకే బ్యారక్‌లో మునుపెన్నడూ చూడని విలక్షణమైన భారత దేశాన్ని చూశానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తోటి ఖైదీలు ఆయన్ని ఎంతో ఆప్యాయంగా `భీష్మ పితామహ` అని పిలుచుకునేవారని.. ప్రతి రాత్రి ఆయన చుట్టూ చేరి దెయ్యాల కథలు చెప్పమని కోరేవారని గుర్తు చేసుకున్నారు. తానేమీ చేయకపోయినా? వారు తన బట్టలు ఉతకడం.. భోజనం తీసుకురావడం వంటి పనులన్నీ చేస్తూ తనను ప్రాణంలా కాపాడుకున్నారని ఎమోషనల్ అయ్యారు.
అయితే మానసికంగా లభించిన ఈ మద్దతుకు భిన్నంగా.. విక్రమ్ భట్ శారీరకంగా మాత్రం జైలులో మరణం అంచుల్లోకి వెళ్లారు. విక్రమ్ భట్ ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అనే తీవ్రమైన ఆటోఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్నారు. డిసెంబర్- జనవరి నెలల తీవ్రమైన చలిలో జైలులో కఠినమైన నేలపై మ్యాట్ వేసుకుని పడుకోవడం వల్ల కీళ్లు, కండరాల నొప్పులు తీవ్రరూపం దాల్చాయి. దానికి తోడు జైలులోనే విక్రమ్ కు కామెర్లు సోకడం, రాత్రి వేళల్లో విపరీతమైన జ్వరం రావడంతో పరిస్థితి మరింత విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరినా? తగినంత సెక్యూరిటీ గార్డులు లేరనే నెపంతో అధికారులు ఆలస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య సహాయం అందేలా లేదని గ్రహించిన విక్రమ్ భట్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి స్వయంగా ఆహార నియమాలను మార్చుకున్నారు. నూనె వస్తువులను పూర్తిగా పక్కన పెట్టి కేవలం శెనగలు, పండ్లు, నీటిపైనే జీవించడం ప్రారంభించారు. జైలు బ్యారక్‌లో ఉన్న దేవి చిత్రం ముందు నిరంతరం ప్రార్థనలు చేస్తూ దేవుడికి దగ్గరయ్యానని.. ఆ విశ్వాసమే తనను నెమ్మదిగా కోలుకునేలా చేసిందని వెల్లడించారు. దాదాపు చనిపోయే స్థితి నుండి తోటి ఖైదీలు తమ దుప్పట్లు ఇచ్చి కాపాడిన ఆ రోజులను తాను జీవితంలో మరువలేనని గుర్తు చేసుకున్నారు. జైలు నుండి బెయిల్‌పై విడుదలైన తర్వాత బాలీవుడ్ పరిశ్రమ నుండి తనకు లభించిన స్పందన కూడా ఆశ్చర్యపరిచిందన్నారు.
సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, సంజయ్ దత్ వంటి వారు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారని విక్రమ్ భట్ తెలిపారు. ముఖ్యంగా సంజయ్ దత్‌తో తాను ముందెన్నడూ కలిసి పనిచేయకపోయినా? ఆయన ఫోన్ చేసి ధైర్యం చెప్పడం గొప్ప విషయమని కొనియాడారు. అలాగే బాల్య మిత్రుడైన అజయ్ దేవగన్ కూడా ఫోన్ చేసి సంఘీభా వాన్ని ప్రకటించారని.. ఆపద కాలంలో ఎవరు నిజమైన స్నేహితులో తనకు అర్థమైందని వివరించారు.
మొత్తంగా 70 రోజుల జైలు జీవితం విక్రమ్ భట్‌కు దర్శకుడిగా కొత్త పాఠాన్ని నేర్పింది. ఎయిర్ కండిషన్డ్ రూములు, సినిమా బబుల్ దాటి థియేటర్లలో తమ సినిమాలను చూసే అసలైన సామాన్య భారతీయ ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని.. వారిలోని నిష్కల్మషమైన ప్రేమాభిమానాలను అర్థం చేసుకోవడానికి ఇదొక రిఫ్రెషర్ కోర్సులా ఉపయోగపడిందని భట్ ముగించారు.
