Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తాడా?

ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్.

By:  Tupaki Desk   |   4 April 2024 3:52 PM GMT
రౌడీ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తాడా?
X

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. 'గీత గోవిందం'తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న రౌడీ బాయ్.. మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు కొట్టలేదు. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు నిరాశ పరచగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'లైగర్' మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. గతేడాది వచ్చిన 'ఖుషి' కూడా ఆశించినంత విజయాన్ని అందించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్.

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''ఫ్యామిలీ స్టార్''. 'గీత గోవిందం' తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందిన చిత్రమిది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ మూవీ టాక్ కోసం వీడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'ఫ్యామిలీ స్టార్' రిజల్ట్ పై విజయ్ దేవరకొండ చాలా ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కోసం గట్టిగా ప్రమోషన్స్ చేసారు.. చేస్తూనే ఉన్నారు. 'గీత గోవిందం' కంటే పెద్ద హిట్ అవుతుందని, మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుద్దని నమ్ముతున్నారు. ఇప్పటికే తన తండ్రి ఈ సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా బాగాలేకపోతే నిర్మొహమాటంగా చెప్పే ఆయన, రెండు రోజుల క్రితం ఈ మూవీ చూసి చాలా బాగుందని చెప్పారట. అలానే నిర్మాత దిల్ రాజు సతీమణి కూడా ఈ సినిమా చూసి పెద్ద విజయం సాధిస్తుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.

నిజానికి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ పడిన తర్వాత, విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'తో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరముంది. తన మార్కెట్, స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాల్సి ఉంది. అందుకే అతని కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ చాలా కీలమని చెప్పాలి. ఇది హిట్టయితే తర్వాత రాబోయే గౌతమ్ తిన్ననూరి సినిమాతో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను టార్గెట్ చెయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈసారి విజయ్ కచ్చితంగా హిట్టు కొట్టి చూపించాలి. ఒకరకంగా ఇది యువ హీరోకి అగ్ని పరీక్షే అనుకోవాలి.

అయితే విజయ్ దేవరకొండకు లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ సపోర్ట్ కూడా తోడవ్వడం సానుకూలమైన విషయం. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. గోపీ సుందర్ సమకూర్చిన పాటలు 'గీత గోవిందం' రేంజ్ లో లేకపోయినా.. రెండు సాంగ్స్ బాగానే జనాల్లోకి వెళ్లాయి. 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ సినిమాపై అందరిలో ఆసక్తిని రెట్టింపు చేసింది. యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీతో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ అలరించే అంశాలు కూడా ఉన్నట్లు హామీ ఇచ్చారు. మాస్ ప్రేక్షకులు కోరుకునే ఫైట్స్ కూడా ఉన్నాయని హింట్ ఇచ్చారు.

'ఫ్యామిలీ స్టార్' మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడులోనూ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. 'ఖుషీ' సినిమాను అక్కడ 100 కు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తే, ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏకంగా 250 థియేటర్లలో విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఇది తమిళనాట మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అవకాశం కల్పిస్తుంది. ఆల్రెడీ మన దగ్గర సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వడం, ఇప్పట్లో మరో పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. టాక్ బాగుంటే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు ఖాయం. మరి వీటన్నింటినీ క్యాష్ చేసుకుని రౌడీ స్టార్ 'ది విజయ్ దేవరకొండ' అనిపించుకుంటారేమో చూడాలి.