Begin typing your search above and press return to search.

#GlobeTrotterEvent - రాజ‌మౌళితో హ‌నుమ చేయించాడు

``కొన్నిటిని మ‌నుషులు చేస్తారు. కొన్నిటిని దేవుడే చేయించుకుంటాడు. ఈ సినిమాకి దైవ‌సంక‌ల్పం ఉంది. ఈ సినిమాని రాజ‌మౌళితో హ‌నుమంతుడే చేయించాడు!`` అని అన్నారు ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్.

By:  Tupaki Desk   |   15 Nov 2025 8:24 PM IST
#GlobeTrotterEvent - రాజ‌మౌళితో హ‌నుమ చేయించాడు
X

``కొన్నిటిని మ‌నుషులు చేస్తారు. కొన్నిటిని దేవుడే చేయించుకుంటాడు. ఈ సినిమాకి దైవ‌సంక‌ల్పం ఉంది. ఈ సినిమాని రాజ‌మౌళితో హ‌నుమంతుడే చేయించాడు!`` అని అన్నారు ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్. సూపర్ స్టార్ మహేష్ బాబు - ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేష‌న్ మూవీ SSMB 29 టైటిల్ లాంచ్ వేడుక హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో అత్యంత వైభ‌వంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో విజ‌యేంద్రుడు మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

కార్య‌క్ర‌మంలో క‌థా ర‌చ‌యిత‌ విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ-``ఒక్కోసారి మాట్లాడాల‌నుకున్నా మాట‌లు రావు.. ఒక్కోసారి అనుకోకుండా కొన్ని జ‌రుగుతుంటాయి. ఎప్పుడైనా తిరుమ‌ల‌లో వెంక‌టేశ్వ‌ర సామిని చూసినా .. హిమ‌నీన‌దాల‌ హిమాలయాల‌ను చూసినా గొప్ప అనుభూతి క‌లుగుతుంది. ఈ సినిమాలో 30 ని.ల యాక్ష‌న్ పార్ట్ ఉంది.. దానిని క‌థ అనాలా... యాక్ష‌న్ అనాలా.. ఏమ‌నాలో తెలీదు.. నాకు మాట రావ‌డం లేదు. స‌న్నివేశం వ‌స్తున్నంత సేపూ అలా చూస్తూ ఉండిపోయాను.. మ‌హేష్ బాబు యాక్ష‌న్ చూసి ఆగిపోయాను. డబ్బింగ్ లేదు.. సీజీ లేదు.. ఎలాంటి క‌ల‌ర్ గ్రేడింగ్ లేదు.. అయినా ఆ సీన్ క‌ట్టి ప‌డేసింది. దీనిని నేను మ‌ర్చిపోలేను.. మీరు కూడా థియేట‌ర్ల‌లో దానిని అనుభూతి చెందుతారు. క‌థ రాసిన‌ నేను కాంచి, మాట‌లు రాసిన దేవ‌క‌ట్టా, కెమెరా వ‌ర్క్ విందా ప్ర‌తి క్క‌రూ శ్రామికులే. సుకుమార‌న్, ప్రియాంక చోప్రాల న‌ట‌న‌, ఈ సినిమాని తీసిన‌ రాజ‌మౌళి.. ఇలా గుర్తు చేసుకుంటే, కొన్ని సినిమాలు మ‌నుషులు చేస్తారు. కొన్నిటిని దేవ‌త‌లు చేయించుకుంటారు. అనుక్ష‌ణం రాజ‌మౌళి గుండెల‌పై హ‌నుమ ఉన్నాడు. ప్ర‌తి క్ష‌ణం క‌ర్త‌వ్యం బోధించాడు.. ఈ సినిమా చేయించుకున్నాడు`` అని అన్నారు.

వేదిక‌పై ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతున్నంత సేపు వేదిక దిగువ‌న ఉన్న స‌హ‌ర‌చ‌యిత కాంచి ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపించారు. ఈ సినిమా కోసం విజ‌యేంద్రునితో పాటు కాంచి కూడా ర‌చ‌నా విభాగంలో ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసారు. ఎస్.ఎస్.రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్, కేఎల్ నారాయ‌ణ‌, ఎం.ఎం.కీర‌వాణి, ఎస్.ఎస్.కార్తికేయ, న‌మ్ర‌త‌, సితార ఘ‌ట్ట‌మ‌నేని త‌దిత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఇక ఈ వేదిక‌పై సుమ క‌న‌కాల‌, ఆశిష్ హోస్టింగ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

వేదిక వ‌ద్ద ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ ల‌తో పాటు ఛామింగ్ హీరో మ‌హేష్ బాబు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారారు. ఫ్యాన్స్ విజిల్స్ తో ఈవెంట్ ఆద్యంతం వేడెక్కిస్తోంది. దుర్గా ఆర్ట్స్‌కు చెందిన కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.