Begin typing your search above and press return to search.

దేవరకొండ సినిమాకు.. ఛత్రపతి లింక్?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:14 AM GMT
దేవరకొండ సినిమాకు.. ఛత్రపతి లింక్?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ లు ఖాతాలో వేసుకున్నారు. వాటి తర్వాత ఖుషి మూవీ విజయ్ కి కొంత ఉపశమనం కలిగించింది. సూపర్ హిట్ కాకపోయిన పర్వాలేదని టాక్ మాత్రం తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ తో సినిమాపై కొంత పాజిటివ్ బజ్ ఉంది. విజయ్ దేవరకొండకి జోడీగా మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నటిస్తోంది. గీతాగోవిందం తర్వాత పరశురామ్ తో విజయ్ చేస్తోన్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పీరియాడికల్ జోనర్ మూవీని విజయ్ దేవరకొండ సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఈ మూవీ మూవీ కథాంశం శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. టాలీవుడ్ లో శ్రీలంక బ్యాక్ డ్రాప్ ని ప్రభాస్ ఛత్రపతి సినిమాలో ఎంచుకున్నారు. ఆ సినిమాలో ఒక సంఘటన వలన ప్రభాస్ తన ప్రజలతో కలిసి విశాఖ తీరానికి చేరుకుంటారు. ఛత్రపతి అప్పట్లో సాలీడ్ హిట్ గా నిలిచింది. ఇక విజయ్ తో చేయబోయే పీరియాడికల్ యాక్షన్ మూవీ కోసం గౌతమ్ తిన్ననూరి శ్రీలంక నేపథ్యం తీసుకుంటున్నారు. ఛత్రపతి తరహాలోనే ఈ చిత్రంలో కూడా హైవోల్టేజ్ డ్రామా, అద్భుతమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయంట.

జెర్సీ సినిమాని స్ఫూర్తివంతమైన కథగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన గౌతమ్ తిన్ననూరి విజయ్ తో చేసే సినిమాలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ని టచ్ చేయబోతున్నారంట. ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త కథాంశం ఈ చిత్రంలో ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.