అందుకే ఆ రోజు అలా మాట్లాడా..
లేడీ సూపర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన విజయశాంతి కెరీర్లో ఎన్నో మంచి మంచి సినిమాలొచ్చాయి.
By: Tupaki Desk | 23 April 2025 8:50 AMలేడీ సూపర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన విజయశాంతి కెరీర్లో ఎన్నో మంచి మంచి సినిమాలొచ్చాయి. ఆమె నటన, టాలెంటే ఆమెను సాధారణ హీరోయిన్ నుంచి లేడీ సూపర్ స్టార్ ను చేశాయి. రీసెంట్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాలో నటించి, కర్తవ్యం సినిమాలోని వైజయంతిని గుర్తు చేసిన విజయశాంతి ఆ సినిమాలో తన నటనతో మంచి మార్కులు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.
తాను ఎలాంటి నటి, ఎలాంటి సినిమాలు చేశాననే విషయం గత తరానికి తెలుసని, ఈ తరానికి కూడా తన టాలెంట్ తెలియాలనే ఆలోచనతోనే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా చేశానని చెప్తున్న విజయశాంతి, ఈ కథలో తల్లీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ తో పాటూ యాక్షన్ కూడా తనను ఎట్రాక్ట్ చేసిందని, ఈ ఏజ్ లో తనకు యాక్షన్ ఎంతో పెద్ద సవాల్ అని, అయినప్పటికీ దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని చేశానని, సినిమా రిలీజయ్యాక అందరి నుంచి ఈ విషయంలో ప్రశంసలొస్తుంటే ఆనందంగా ఉందని విజయశాంతి తెలిపారు.
రాములమ్మను ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలనుకున్నామో అలాంటి పాత్రలోనే చూశామని అందరూ అంటున్నారని, కళ్యాణ్ రామ్ కూడా ఎంతో బాగా నటించాడని, స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ బంధం అలానే ఉంటుందని, కళ్యాణ్ రామ్ తనపై చూపించే ప్రేమ, ఆప్యాయత చూస్తుంటే, గత జన్మలో తను నా బిడ్డేమో అనిపిస్తుందని.. తల్లి, కొడుకుల గురించి కళ్యాణ్ రామ్ అలా మాట్లాడుతుంటే చాలా గర్వంగా అనిపించిందని విజయశాంతి అన్నారు.
కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్నాకాబట్టి సినిమాను చంపేయొద్దని మాట్లాడానని, ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతోమంది బతుకుతున్నారని అందుకే కనీస బాధ్యత వ్యవహరించాలని చెప్పానన్నారు. ప్రతీ ఒక్కరూ హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా గౌరవం ఇవ్వాలని, సీనియర్ ఎన్టీఆర్ తనకంటే ఎంత చిన్నవాళ్లనైనా మీరు అనే గౌరవించేవారని, ఆయన్ను చూసే అందరితో గౌరవంగా ఉండటం నేర్చుకున్నానని చెప్పిన ఆమె, హీరోయిన్లకు పెద్ద పాత్రలు ఇస్తే వాళ్లను వాళ్లు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నారు.
సుమారు 60 మంది హీరోలతో కలిసి పనిచేసిన తాను ఎన్నో ప్రయోగాలు చేశానని, ప్రతీ సినిమాలో హీరోలకు లుక్ మారినా తనకు మాత్రం అదే లుక్ ఉండేదని, ఆ లుక్ లోనే ఎప్పటికప్పుడు ఎన్నోరకాల ఎమోషన్స్ పలికించేదాన్నని, అందుకే ఆడియన్స్ తనను సింహాసనంపై కూర్చోపెట్టారని, పొలిటీషియన్ గా మీటింగ్స్ కు వెళ్లినప్పుడు మీలో ఉండే ధైర్యమే మాకు ఇన్సిపిరేషన్ అని చెప్పినప్పుడు చాలా సంతృప్తిగా ఉండేదని, ప్రేక్షకులకు కృష్ణుడు అనగానే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో, లేడీ పోలీసాఫీసర్ అనగానే విజయశాంతి గుర్తొస్తుందని, అందుకే ఇందులోని వైజయంతీ పాత్రను చేశానని విజయశాంతి చెప్పారు.