Begin typing your search above and press return to search.

న‌టుడు విజ‌య్ ఆంటోని కుమార్తె ఆత్మ‌హ‌త్య‌!

విజ‌య్ ఆంటోని ఇల్లు చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలో ఉంది. తన ఇంట్లోనే త‌న కూతురు మీరా ఉరి వేసుకుని కనిపించింది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 3:54 AM GMT
న‌టుడు విజ‌య్ ఆంటోని కుమార్తె ఆత్మ‌హ‌త్య‌!
X

స్వరకర్త-నటుడు విజయ్ ఆంటోనీ కూతురు మీరా సెప్టెంబర్ 19, మంగళవారం తెల్లవారుజామున చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయస్సు 16. చెన్నై మీడియా క‌థ‌నాల‌ ప్రకారం, ఆమె వేకువ‌ఝామున‌ 3 గంటలకు త‌మ‌ చెన్నై ఇంట్లో చనిపోయి కనిపించింది. వెంట‌నే ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు అప్ప‌టికే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

ఈ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మేమిటి? దీని వెన‌క ఇంకేవైనా కార‌ణాలు ఉన్నాయా? అంటూ పోలీసులు విచార‌ణ సాగిస్తున్నారు. ప్రాథ‌మికంగా మీరా ఒత్తిడికి గురైంద‌ని, దాని కోసం చికిత్స పొంద‌డానికి సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. విజయ్ ఆంటోని అతడి కుటుంబం హృదయ విదారక సంఘటనపై ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

విజ‌య్ ఆంటోని ఇల్లు చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలో ఉంది. తన ఇంట్లోనే త‌న కూతురు మీరా ఉరి వేసుకుని కనిపించింది. స్థానికుల వివ‌రాల ప్ర‌కారం... మీరా నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. తీవ్ర‌ నిరాశ ఒత్తిడితో పోరాడుతున్నట్లు చెబుతున్నారు. ఆమె మృతిపై ప్ర‌స్తుతం పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.

విజయ్ -ఫాతిమా విజయ్ ఆంటోనీ దంప‌తుల‌కు జ‌న్మించిన మీరా ఇలా అకాల‌మ‌ర‌ణం చెంద‌డం తీవ్రంగా క‌ల‌చివేసింది. ఈ దంపతులకు ఒక చిన్న కూతురు కూడా ఉంది. ఏడాదిన్న‌ర క్రితం విజ‌య్ ఆంటోని షూటింగ్ లో తీవ్ర గాయాల‌కు గురైన సంగ‌తి తెలిసిందే. దాని నుంచి కోలుకుని అత‌డు తిరిగి షూటింగుల‌కు వెళుతున్నారు. బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోను విజ‌య్ ఆంటోని గొప్ప న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం అత‌డు త‌మిళం-తెలుగు ద్విభాషా చిత్రాల‌తో విజ‌య్ ఆంటోని బిజీగా ఉన్నారు. సొంత బ్యాన‌ర్ చిత్రాల‌కు విజ‌య్ భార్య ఫాతిమా నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు.