తండ్రి వల్లే ఇంట్లో నుంచి పారిపోయా
హైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మ తన కెరీర్ ను ముందుగా నాటకరంగంలో స్టార్ట్ చేశాడు.
By: Tupaki Desk | 17 May 2025 4:24 PM ISTహైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మ తన కెరీర్ ను ముందుగా నాటకరంగంలో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత పూణెలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి, అక్కడ రెండేళ్ల పాటూ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత అవకాశాల కోసం ముంబై వెళ్లాడు. ముందు షార్ట్ ఫిల్మ్ తో ఇండస్ట్రీలోకి ఎంటరైన విజయ్ వర్మ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తాను అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడో అనే విషయంపై మాట్లాడాడు విజయ్ వర్మ. సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు అసలు ఒప్పుకోలేదని, వాళ్లు తనను ఆ విషయంలో ఎంకరేజ్ చేయనందువల్లే ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చానని విజయ్ వర్మ వెల్లడించాడు.
చిన్నప్పట్నుంచి యాక్టర్ ను కావాలని, దాని కోసం ట్రైనింగ్ కచ్ఛితంగా తీసుకోవాలని అనుకునేవాడినని, కానీ తన ఆలోచన, నిర్ణయం ఇంట్లో వారికి ఏ మాత్రం నచ్చలేదని చెప్పాడు విజయ్ వర్మ. తమ తండ్రి తనతో అంత క్లోజ్ గా ఉండేవారు కాదని, పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని ఆయన ఎప్పుడూ చెప్తుంటారని విజయ్ వర్మ తెలిపాడు
అందుకే ఎవరికీ తెలియకుండా ఫ్రెండ్స్ నుంచి డబ్బులు అప్పుగా తీసుకుని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకుని అక్కడ సీట్ వచ్చాక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చేశానని చెప్పాడు. మామూలుగా ఎవరైనా ఇంట్లో నుంచి బయటికొచ్చేటప్పుడు ఎలాంటి ప్లాన్ చేసుకోరు. బయటికొచ్చాకే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. కానీ తాను మాత్రం ముందే అంతా ప్లాన్ చేసుకుని ఆ తర్వాతే ఇల్లు దాటినట్టు వెల్లడించాడు విజయ్ వర్మ.
అలా పారిపోయి వచ్చినప్పటికీ, ఇప్పుడు కుటుంబ సభ్యులు తనను చూసి గర్వించే స్థాయికి వచ్చానని, ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయని విజయ్ వర్మ తెలిపాడు. హైదరాబాద్ అయినప్పటికీ సౌత్ సినిమాల్లో నటించకపోవడం గురించి విజయ్ మాట్లాడుతూ, దానికి పెద్దగా కారణాలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతం విజయ్ బాలీవుడ్ సిరీస్‌లు, సినిమాలే చేస్తున్నాడు.
