మాతృవియోగంలో ఉన్న స్నేహితుడికి CM ఓదార్పు.. తళా ఇంటికి దళపతి-త్రిష
ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ శనివారం నాడు అజిత్ ఇంటికి వెళ్లి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.
By: Sivaji Kontham | 31 May 2026 11:07 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో తళా అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మోహిని మణి (84) శనివారం కన్నుమూశారు. దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్ ఈ వార్త తెలియగానే శనివారం హుటాహుటిన చెన్నైకి చేరుకున్నారు. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అజిత్‌ను.. అతడి కుటుంబాన్ని ఓదార్చడానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలివచ్చారు. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ శనివారం నాడు అజిత్ ఇంటికి వెళ్లి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.
తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్, విజయ్ ఇద్దరూ సమకాలీన మాస్ స్టార్లుగా ఎన్నో ఏళ్లుగా పోటాపోటీగా రాణిస్తూ కెరీర్ పీక్స్ చూశారు. వీరిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉంటాయి. అయితే వృత్తిపరంగా ఎంత పోటీ ఉన్నా వ్యక్తిగతంగా ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం, అభిమానం - ప్రేమ ఉన్నాయి. వీరి కుటుంబాలు కూడా ఎప్పుడూ కలుసుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పుడు కూడా అజిత్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి అతడికి అభినందనలు తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు అజిత్ మాతృవియోగంలో ఉన్నారనే విషయం తెలియగానే ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి భేషజాలకు పోకుండా శనివారం నేరుగా తన సహచర నటుడు, స్నేహితుడైన అజిత్ నివాసానికి చేరుకున్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ అజిత్ ఇంటికి వచ్చిన సీఎం విజయ్ వాహనం దిగగానే అక్కడకు వచ్చిన అజిత్‌ను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి.. మోహిని మణి గారి భౌతికకాయానికి నివాళులర్పించారు.
నటి త్రిష కృష్ణన్ కూడా నలుపు రంగు సాంప్రదాయ సల్వార్ సూట్ ధరించి అజిత్ నివాసానికి వచ్చారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపి వారికి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 1995లో వచ్చిన `రాజావిన్ పార్వయిలే` చిత్రంలో విజయ్- అజిత్ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే అయినా.. నాటి నుండి నేటి వరకు వీరి అనుబంధం ఎంతో స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. తమిళనాడులోని పలు ముఖ్యమైన ఈవెంట్లలో విజయ్-అజిత్ కలిసి కనిపించారు. అజిత్ తన కుటుంబ వేడుకలన్నిటికీ విజయ్ ఫ్యామిలీని ఆహ్వానిస్తుంటారు. అలాగే విజయ్ ఇంట్లో జరిగే వేడుకల్లోను అజిత్ పాల్గొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా విజయ్ తన పాత స్నేహాన్ని మరువకుండా.. కష్టసమయంలో ఉన్న తోటి నటుడి ఇంటికి వచ్చి పరామర్శించడంపై ఇటు ఇండస్ట్రీ వర్గాలు.. అటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌డమ్- రాజకీయ హోదాలను పక్కన పెట్టి మానవత్వంతో అజిత్ కుటుంబాన్ని ఓదార్చిన సీఎం విజయ్, త్రిషలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ పరామర్శ.. చిత్ర పరిశ్రమలోని నటీనటుల మధ్య ఉండే ఆత్మీయ బంధానికి అద్దం పడుతోంది.
సినిమా ఇండస్ట్రీలో ఎంతటి తీవ్రమైన వృత్తిపరమైన పోటీతత్వం, అభిమానుల మధ్య ఘర్షణలు (ఫ్యాన్ వార్స్) ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో విపత్తులు సంభవించినప్పుడు అగ్ర తారలు భేషజాలు పక్కన పెట్టి ఒకరినొకరు ఆదుకోవడం.. అభిమానులలో ఉండే విద్వేషాలను తగ్గించి, చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం.
