సేతుపతితో పూరి పాత పద్దతిలోనేనా?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2025 12:35 PM ISTమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లాక్ అయిన నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పూరి శైలికి భిన్నమైన కథ కావడంతోనే సేతుపతి అంగీకరించి ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇది పూరి మార్క్ చిత్రమా? అతడి శైలిని పక్కనబెట్టి చేస్తున్నాడా? అన్నది పక్కన బెడితే సినిమాలో నటీనటులకు భారీ పారితోషికం చెల్లించి మరీ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ సేతుపతి ఈ సినిమాకు హాయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రేంజ్ లో పారితోషికం సేతుపతి ఇప్పటి వరకూ ఏ సినిమాకు తీసుకోలేదంటున్నారు. ఆ రకంగా సేతుపతి కెరీర్ లో తొలి భారీ పారితోషికం అందుకున్న చిత్రంగా నిలిచిపోతుందంటున్నారు. అలాగే సినిమాలో ఓ కీలక పాత్రకు టబును ఎంపిక చేసారు. ఆమె కూడా భారీగానే ఛార్జ్ చేస్తోందట. పారితోషికం విషయంలో సీనియర్ నటి రూపాయి కూడా తగ్గలేదంటున్నారు.
ఈ సినిమాకు టబు కూడా చాలా రోజులు డేట్లు కేటాయించాల్సి వస్తోందిట. సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా కన్పమ్ కాలేదు. మరి పూరి ఆమెకు ఎంత చెల్లిస్తాడో? పారితోషికాలు చెల్లించడంలో పూరి ఎక్కడా రాజీ పడడు. నటీనటులు అడిగినంత చెల్లిస్తాడు. వాళ్లతో బేరసారాలు కూడా ఆడడని పూరికి పేరుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని సమాచారం.
షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి నిరవధికంగా జరుగుతుందట. ఈ చిత్రం షూటింగ్ కూడా పూరి వేగంగా పూర్తి చేస్తాడని సమాచారం. వరుస ప్లాప్ ల నేపథ్యంలో షూటింగ్ లో వేగంగా తగ్గించి ఆచితూచి చేస్తానని ఆ మధ్య అన్నారు. కానీ అలా చేసిన పూరికి ప్లాప్ లు తప్పలేదు. దీంతో పూరి పాత పద్దతిలోనే ఈ చిత్రాన్ని ముగిస్తాడని సన్నిహితుల సమాచారం.
