పూరి-విజయ్ మూవీ ఏం జరుగుతోందంటే..!
ఎప్పటిలాగే పూరి ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అంచనాలు పెంచుతున్నాయి.
By: Tupaki Desk | 5 May 2025 3:30 PMపూరి జగన్నాథ్ దర్శకత్వంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఎప్పటిలాగే పూరి ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అంచనాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన టబు, రాధిక ఆప్టేలు నటిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. వీరిద్దరితో పాటు నివేదా థామస్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
గత కొన్ని నెలలుగా దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ నుంచి మొదలు పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం ఒకటి చిత్ర యూనిట్ సభ్యుల నుంచి లీక్ అయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక ప్రత్యేక సెట్‌ను హైదరాబాద్‌లో పూరి జగన్నాథ్ వేయించాడు. ఆ సెట్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపే అవకాశాలు ఉన్నాయట. సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ప్రత్యేకంగా వేసిన సెట్‌లోనే షూట్ చేస్తారని యూనిట్ సభ్యుల ద్వారా అనధికారిక సమాచారం అందుతోంది.
జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో విజయ్ సేతుపతిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలవుతుంది. అప్పటి వరకు సదరు సెట్ వర్క్ పూర్తి చేయాలని పూరి ప్రొడక్షన్ టీమ్ కి సూచించాడని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో పూరి ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్‌ను కాస్త తగ్గిస్తారనే వార్తలు వస్తున్నాయి. కానీ పూరి మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీసేందుకు ఎంత దూరం అయినా వెళ్తాడు అని అంటూ ఉంటారు. కనుక ఈ సినిమాకు కాస్త ఎక్కువ బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు. ఆ విషయమై పూరి నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఇటీవల విజయ్ సేతుపతితో కలిసి పూరి జగన్నాథ్, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా సినిమాను అధికారికంగా ప్రకటించారు. కేవలం రెండు నెలల్లో సినిమాను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయితే ఏమాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌ను జరిపి తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకే ప్రీ ప్రొడక్షన్ విషయంలో పూరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. పూరి డబుల్ ఇస్మార్ట్‌తో డిజాస్టర్ చవి చూడటంతో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ఆయనకు మొహం చాటేశారట. అందుకే చాలా కసితో ఈ సినిమాను పూరి తీస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.