అప్పుల బాధల నుంచి అగ్ర హీరోగా!
తాజాగా ఓ పాడ్‌కాట్‌లో తన బాల్య జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. చిన్నతనంలో తన కుటుంబం పడిన ఆర్థిక ఇబ్బందులు తన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో వివరించారు.
By: Srikanth Kontham | 27 July 2026 1:57 PM ISTఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నేడు అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్‌లలో ఒకరుగా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. తాజాగా ఓ పాడ్‌కాట్‌లో తన బాల్య జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. చిన్నతనంలో తన కుటుంబం పడిన ఆర్థిక ఇబ్బందులు తన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో వివరించారు.
జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చూసి పారిపోకూడదని తన తండ్రి ద్వారా నేర్చుకున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు. తమ ఇంటికి రుణ వసూలుదారులు వచ్చినప్పుడు తాను ఎప్పుడూ దాక్కోలేదని, బదులుగా తన తండ్రి పక్కనే కూర్చుని ఆ పరిస్థితిని ఆయన ఎలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారో గమనించానని గుర్తు చేసుకున్నారు. ఆ క్షణాలే తనకు జీవితంలో అతిపెద్ద పాఠాలు నేర్పించాయని, సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని తనకు అలవాటు చేశాయని పేర్కొన్నారు. పేదరికం లో తమ కుటుంబం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసినప్పటికీ తండ్రి చూపిన సంకల్పం తనపై చెరగని ముద్ర వేసిందన్నారు.
నిజానికి చిన్నతనంలో నటుడిగా మారాలనే కల ఏనాడూ తనకు లేదన్నారు. తన కుటుంబాన్ని పోషించడానికి కావలసిన సంపాదన సంపాదించడమే ఆనాడు తన ఏకైక లక్ష్యంగా ఉండేదని తెలిపారు. సినీ రంగ ప్రవేశానికి ముందు విజయ్ సేతుపతి జీవనం కోసం అనేక పనులు చేశారు. సేల్స్‌మ్యాన్‌గా, క్యాషియర్‌గా, అకౌంటెంట్‌గా వివిధ ఉద్యోగాలు చేయడంతో పాటు దుబాయ్‌లోనూ కొన్ని సంవత్సరాలు పని చేశారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి వృత్తి మార్గాన్ని మార్చుకున్నట్లు తెలిపారు. తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాలు చిన్న వయస్సులోనే తనను ఎంతో పరిపక్వం చెందేలా చేశాయని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డారు.
కష్టపడి పని చేయడం, జీవితంలో బాధ్యతలను ఆ అనుభవాలే తనకు నేర్పించాయన్నారు . బాల్యంలో ఎదురైన ఆ కష్టాలే తనను భవిష్యత్తులో నిజ జీవిత పోరాటాలకు.. సినిమా రంగంలో రాణించడానికి పూర్తిగా సిద్ధం చేశాయని బలంగా నమ్ముతానన్నారు. `తెన్మేర్కు పరువకాట్రూ` చిత్రంతో కెరీర్‌లో తొలి విజయం అందుకున్న విజయ్ సేతుపతి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. `సూధు కవ్వుమ్`, `పిజ్జా`, `విక్రమ్ వేద`, `96`, `మాస్టర్`, `విక్రమ్` , `మహారాజా` వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌లను, కంటెంట్-డ్రైవెన్ చిత్రాలతో బ్యాలెన్స్ చేస్తూ అరుదైన విజయాలను అందుకున్నారు. అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను తాకినా? విజయ్ సేతుపతి స్వభావరీత్యా ఎంతో వినయంగా, నిరాడంబరంగా ఉండటం విశేషం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అప్పుల బాధలను తట్టుకుని తన కష్టంతోనే ఎదిగిన విజయ్ ప్రయాణం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
