మళ్లీ 96 మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2025 6:45 PMవిజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆహ్లాదకరమైన ప్రేమ, భావోద్వేగాలకు పెద్ద పీట వేసి తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్ హృదయాలను గెలుచుకుంది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నామని మేకర్స్ ప్రకటించగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
96 చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష, దేవదర్శిని, భగవతి పెరుమాళ్ తదితరులు నటించారు. సేతుపతి, త్రిషల నటనకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాని ఒక అందమైన జ్ఞాపకంలా మలిచిన ప్రేమ్ కుమార్ ప్రశంసలు అందుకున్నారు. చాలా కాలంగా సీక్వెల్ గురించిన చర్చ సాగుతోంది. ఇప్పటికే రెండవ భాగానికి స్క్రిప్ట్ రాసిన ప్రేమ్ కుమార్ కొనసాగింపు కథపై ఎక్కువగా దృష్టి సారించారు. 96 సీక్వెల్ లోను చక్కని భావోద్వేగాలు వర్కవుట్ కానున్నాయని దర్శకుడు చెబుతున్నారు.
ఈ సినిమా సీక్వెల్ మొదటి పార్ట్ తరహాలో అదే మ్యాజిక్‌ను తిరిగి తీసుకువస్తుందని భావిస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో ఈ సీక్వెల్ ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేస్తున్నారు. మునుపటి కథకు కొనసాగింపు కథలో తిరిగి మునుపటి తారలు నటిస్తున్నారు అనగానే అభిమానులలో చాలా ఉత్సాహం నెలకొంది. నిజానికి పీసీ శ్రీరామ్ అనారోగ్య కారణాలతో ఈ సీక్వెల్ కి దూరమయ్యారని ప్రచారం సాగింది. కానీ ఇటీవల పీసీ స్వయంగా తాను 96 సీక్వెల్ కి పని చేస్తున్నానని దృవీకరించారు. అతడి ప్రకటన అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.