కింగ్ ఫిషర్ మాల్యా ఆస్తిని కొన్న బండ్ల గణేష్ స్నేహితుడు!
కింగ్ ఫిషర్ బీర్లు తాగేవారిలో చాలామందికి కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా పూర్తి చరిత్ర తెలియకపోవచ్చు.
By: Tupaki Desk | 9 Jun 2025 2:00 AM ISTకింగ్ ఫిషర్ బీర్లు తాగేవారిలో చాలామందికి కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా పూర్తి చరిత్ర తెలియకపోవచ్చు. అతడి విలాసవంతమైన జీవనశైలి రారాజులు, చక్రవర్తులను మించినది. టాప్ మోడల్స్, సినిమా కథానాయికలతో మాల్యా విలాసాలు, విందులు అన్నీ ఇన్నీ కావు. వీటన్నిటికీ చోటు ఎక్కడ...? అంటే.. అది కచ్ఛితంగా గోవా బీచ్‌లోని అతడి ఖరీదైన కింగ్ ఫిషర్ విల్లాలో. రాజభవనాన్ని తలపించే ఈ విలాసాల విల్లాలో ఒకప్పుడు షాంపైన్ పొంగించి ముగింపులో కిల్లీలు చుట్టిన పార్టీలు అన్నీ ఇన్నీ కావు.
కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పిలుపు అందుకున్న ది గ్రేట్ విజయ్ మాల్యా ఉత్థానపతనాల చరిత్రలో ఈ విల్లాకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐడిబిఐ రుణం 900కోట్లు ఎగవేసాక మాల్యా సామ్రాజ్యం నెమ్మదిగా కుప్పకూలడం ప్రారంభమై, 2016 నాటికి చట్టపరంగా అన్నివిధాలా లాక్ అయ్యాడు. దీంతో అతడు భారతీయ పోలీసులు, చట్టాలకు చిక్కకుండా కింగ్‌ఫిషర్ విల్లాను, ఇతరు ఆస్తులను వదిలివేసి దొంగ చాటుగా యునైటెడ్ కింగ్‌డమ్‌కు పారిపోయాడు. ఆ తర్వాత యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని కింగ్స్ ఎస్టేట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మాల్యా నుండి బకాయిలను వసూలు చేయడానికి స్వాధీనం చేసుకుంది. మూడుసార్లు వేలం విఫలమైనా, నాలుగోసారి బిజినెస్ మేన్ కం హీరో సచిన్ జోషి దీనిని 73 కోట్లకు సొంతం చేసుకున్నాడు.
అటుపై కింగ్‌ఫిషర్ నుండి `కింగ్స్ మాన్షన్`గా పేరు మారింది. మూడు ఎకరాల స్థలంలో 12,350 చదరపు అడుగుల విశాలమైన స్థలంతో విల్లా చాలా కాలంగా విలాసాలకు చిహ్నంగా నిలిచింది. ఇందులో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, అందంగా అలంకరించిన పచ్చిక బయళ్ళు, ఓపెన్-ఎయిర్ డ్యాన్స్ ఫ్లోర్లు, కృత్రిమ చెరువులు, ఒకప్పటి లగ్జరీ కార్ల సముదాయం.. అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు నగరంలోని ఉన్నత వర్గాల కిలకిలారావాలతో, గ్లామ్ అండ్ గ్లిజ్ పార్టీల సందడితో ఈ స్థలం మనోహరంగా ఉండేది. కానీ ఇప్పుడు అది వేరొకరి సొంతం అయింది.
మాల్యా గోవా ఆస్తిని కొనుగోలు చేసిన సచిన్ జోషి గురించి పరిచయం అవసరం లేదు. అతడు టాలీవుడ్ లో ఆషిఖి 2 తెలుగు రీమేక్ లో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయినా కానీ, నిర్మాత బండ్ల గణేష్ తో వివాదాల కారణంగా సచిన్ జోషి పేరు మార్మోగింది. బండ్ల వర్సెస్ సచిన్ జోషి వివాదం కోర్టుల వరకూ వెళ్లింది. సచిన్ జోషి ముంబైలో బడా పారిశ్రామికవేత్త. దిగ్గజ వ్యాపారి. సినిమాలు- నటన అతడికి కేవలం ఆటవిడుపు మాత్రమే. వ్యాపారదగ్గజం ప్రఖ్యాత JMJ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి జగదీష్ జోషి కుమారుడు సచిన్ జోషి. అతడు స్వయంగా వైకింగ్ వెంచర్స్‌ను నిర్వహిస్తున్నాడు. ఇది మద్యం (ముఖ్యంగా కింగ్స్ బీర్) నుండి ఆతిథ్య రంగం, వెల్నెస్ వరకు ప్రతి వ్యాపారం నిర్వహిస్తుంది. `కింగ్` లేబుల్‌తో సంబంధం తెగ కుండా మాల్యా నుంచి కొనుగోలు చేసిన విల్లాను `కింగ్స్ మాన్షన్`గా నామకరణం చేసాడు జోషి. సచిన్ జోషి కథానాయిక ఊర్వశి శర్మను పెళ్లాడాడు. అతడికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
