Begin typing your search above and press return to search.

చిరంజీవి కోసం కథ సిద్ధం.. ఎలా ఉంటుందంటే: భైరవం దర్శకుడు

ఒక సోషల్ మీడియా పోస్ట్ కారణంగా ‘భైరవం’ దర్శకుడు విజయ్ కనకమేడల ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 May 2025 12:24 AM IST
చిరంజీవి కోసం కథ సిద్ధం.. ఎలా ఉంటుందంటే: భైరవం దర్శకుడు
X

ఒక సోషల్ మీడియా పోస్ట్ కారణంగా ‘భైరవం’ దర్శకుడు విజయ్ కనకమేడల ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. 2011లో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్‌ల ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆ పోస్టు స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో డైరెక్టర్‌పై ట్రోలింగ్ ఊపందుకుంది. ముఖ్యంగా మెగా అభిమానులు 'భైరవం' సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో విజయ్ కనకమేడల స్పష్టత ఇచ్చారు. "ఆ పోస్టు నేను స్వయంగా చేయలేదు. నా పేజ్‌లో ఉండటంతో నేను బాధ్యత తీసుకుంటున్నాను. అయితే అది హ్యాక్ అయి ఉండవచ్చు" అంటూ ఆయన తెలిపారు. అంతేగాక, "పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు పని చేశాను. సాయి ధరమ్ తేజ్ గారితో స్నేహం ఉంది. అలాంటి అనుబంధాల మధ్య నేను మెగా ఫ్యామిలీని ఎందుకు దూరం చేసుకుంటాను?" అని ప్రశ్నించారు. ఈ వివరణకు మెగా అభిమానుల నుంచి కొంత సానుకూల స్పందన వస్తోంది.

ఇప్పుడు విజయ్ కనకమేడల మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఆయన స్వయంగా రాసుకున్న కథను మెగాస్టార్ చిరంజీవికి చెప్పాలని చూస్తున్నారు. సొసైటీ నేపథ్యంలో, సమకాలీన సమస్యలను బేస్ చేసుకొని ఓ కథను రాసినట్లు పేర్కొన్నారు. ‘‘ఆ కథ ఒక ఠాగూర్ తరహాలో ఉంటుంది. పెద్ద ఎత్తున సామాజిక సందేశం ఉండే కథ. చిరంజీవి గారు లాంటి స్టార్‌తో చేస్తే బాగా రీచ్ అవుతుంది. ప్రస్తుతం కథ పూర్తిగా సిద్ధం చేస్తున్నాను. భైరవం విడుదల అయిన తర్వాత ఆయనను కలవాలి. ఆయనకు నచ్చితే, నా తదుపరి సినిమా ఆయనతోనే చేయాలని ఉంది’’ అని చెప్పారు.

అంతేకాదు, చిరంజీవిని ఒక కొత్త కోణంలో చూపించాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘‘అయన చేయని పాత్రలు లేవు. కానీ మనకు తెలిసిన పాత్రల్లోనే ఏదైనా కొత్తగా చేయొచ్చు. ఆయన చేయని యాక్షన్లు లేవు. అలాంటి నటుడితో కొత్త దాన్ని ప్రయత్నించాలనేది నా ఆలోచన’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారాయి.

ఇదిలా ఉండగా, భైరవం సినిమాపై ప్రస్తుతం మంచి బజ్ ఉంది. మే 30న విడుదల కానున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, దివ్యా పిళ్లై తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ హిట్ గరుడన్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రీన్‌ప్లే రూపొందించారు. ట్రైలర్‌తో పాటు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.