Begin typing your search above and press return to search.

జననాయగన్.. గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లేనా..

సినిమా గ్లామర్ కి రాజకీయ పవర్ తోడైతే వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు తమిళనాడులో సరిగ్గా ఇదే జరుగుతోంది.

By:  Tupaki Desk   |   4 May 2026 1:07 PM IST
జననాయగన్.. గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లేనా..
X

సినిమా గ్లామర్ కి రాజకీయ పవర్ తోడైతే వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు తమిళనాడులో సరిగ్గా ఇదే జరుగుతోంది. దళపతి విజయ్ తన సినీ ప్రయాణానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడంతో, ఆయన ఆఖరి సినిమా ‘జననాయగన్’ పై అందరి దృష్టి పడింది. గత కొన్నాళ్లుగా ఈ సినిమా చుట్టూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంది. అసలు ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.

సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా అంటే రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఉంటాయి. కానీ ఇక్కడ సినిమా కంటే విజయ్ రాజకీయ భవిష్యత్తు పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK కి ఎన్నికల ఫలితాల్లో వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. సీఎం కుర్చీ పై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ, మెజారిటీ ఫలితాలు విజయ్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తున్నాయి.

అసలు విషయం ఏంటంటే, ‘జననాయగన్’ సినిమాకు మొదట్లో సెన్సార్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. దానికి తోడు ఎడిటింగ్ రూమ్ నుంచే సినిమానే లీక్ అవ్వడం చిత్ర యూనిట్ ను ఆందోళనలో పడేసింది. పైరసీ దెబ్బతో సినిమా పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో విజయ్ కు వస్తున్న ఆదరణ చూస్తుంటే, ఆ నెగటివ్ వైబ్స్ అన్నీ తొలిగిపోయి సినిమాకు ఒక మంచి శకునం లాగా అనిపిస్తోంది. రాజకీయంలో దొరుకుతున్న ఈ మైలేజ్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మార్గం సుగమం చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మే 8న సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. లీక్ వ్యవహారంతో బయ్యర్లు కొంత వెనక్కి తగ్గినప్పటికీ, తాజా రాజకీయ పరిణామాల తర్వాత మళ్ళీ ‘జననాయగన్’ హాట్ కేక్ లా మారిపోయింది. విజయ్ రాజకీయ విజయానికి ఈ సినిమా ఒక పునాది లాంటిదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే థియేటర్ల దగ్గర మునుపెన్నడూ లేని విధంగా హడావుడి కనిపించే అవకాశం ఉంది. తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోల కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

ఇక విజయ్ తన ఆఖరి సినిమాతో అటు వెండితెరపై, ఇటు రాజకీయాల్లోనూ ఒకేసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. సినిమా షూటింగ్ దశలో ఎదురైన అడ్డంకులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. ఒకవేళ ఎన్నికల ఫలితాలు పక్కాగా ఆయనకు అనుకూలంగా వస్తే, ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. మరి మే 8న విడుదల కాబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ విజయ్ కెరీర్ లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.