బాలయ్య కేసరికి నాయగన్‌కి పోలిక తక్కువే..!
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం 'జన నాయగన్' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. పూర్తి స్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కి ఇది చివరి సినిమా అనే విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 20 May 2025 1:28 PM ISTతమిళ్ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం 'జన నాయగన్' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. పూర్తి స్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన విజయ్‌కి ఇది చివరి సినిమా అనే విషయం తెల్సిందే. ఇప్పటికే విజయ్ చివరి సినిమా ఇదే అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల నేపథ్యంలో జన నాయగన్ సినిమాను రాజకీయ మైలేజ్ కోసం విజయ్ వాడుకోవాలని భావిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై సినిమా విడుదల అయితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. జన నాయగన్ సినిమాను తెలుగు హిట్ మూవీ భగవంత్ కేసరి కి రీమేక్‌గా రూపొందిస్తున్నారనే విషయం తెల్సిందే.
జన నాయగన్ సినిమాకు అనిల్ రావిపూడితో దర్శకత్వం చేయించాలని గట్టిగానే ప్రయత్నాలు జరిగాయట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. జన నాయగన్ సినిమా మెయిన్ స్టోరీ లైన్‌ను భగవంత్ కేసరి నుంచి తీసుకున్న మాట వాస్తవం కానీ మక్కీ కి మక్కీ అన్నట్లుగా రీమేక్ చేయడం లేదని మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. సినిమాలోని మెయిన్ స్టోరీ లైన్‌కి తమిళ రాజకీయ నేపథ్యంలో కలుపుతూ, సున్నితమైన అంశాలను కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తూ సినిమాను దర్శకుడు హెచ్ వినోద్ రూపొందిస్తున్నాడు. విజయ్ రాజకీయాల్లో ఉన్న ఈ సమయంలో కచ్చితంగా ఈ సినిమా ఆయనకు పొలిటికల్ మైలేజ్ తెచ్చి పెడుతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించగా శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. ఇక రీమేక్‌లో విజయ్ హీరోగా నటిస్తూ ఉండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, మంచి మెసేజ్ సైతం సినిమాలో ఉండే విధంగా దర్శకుడు ప్లాన్ చేశాడు. అమ్మాయిల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపును ఎత్తి చూపిస్తూ, అమ్మాయిలు అబ్బాయిలకు ఏ మాత్రం తక్కువ కాదు అని చూపించే విధంగా భగవంత్ కేసరి సినిమాలోని సన్నివేశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని అలరించే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి వినోదాత్మక సన్నివేశాలతో పాటు, సందేశం ఇచ్చే సన్నివేశాలను రూపొందించడం ద్వారా హిట్ దక్కించుకున్నాడు.
విజయ్ 'జన నాయగన్' సినిమాలో ఎప్పటిలాగే స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నాడు. భగవంత్ కేసరి సినిమాను మొదట ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేయాలని భావించారని, కానీ విజయ్ రాజకీయ అవసరాలు, వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం వంటి కారణాల వల్ల కేవలం మెయిన్ స్టోరీ లైన్‌ను తీసుకుని మొత్తం స్క్రీన్ ప్లేను కొత్తగా రాసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా విడుదల కాబోతుంది. సూపర్ స్టార్ విజయ్ గతంలో పలు రీమేక్‌లు చేసి విజయాలను అందుకున్నాడు. కనుక ఈ సినిమాతో మరో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకుంటాడా, ఈ చివరి సినిమా ఆయన అభిమానులకు గుర్తుగా ఉండి పోతుందా అనేది చూడాలి.
