దళపతి విజయ్ ఫ్యామిలీ కోర్టుకు వెళతాడా?
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకె పార్టీ అధినేత విజయ్ గత కొంత కాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. టీవీకే పార్టీ కార్యక్రమాలతో పాటు వ్యక్తగత విషయాల కారణంగా విజయ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
By: Ravindar Gorantla | 20 April 2026 6:04 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో, టీవీకె పార్టీ అధినేత విజయ్ గత కొంత కాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. టీవీకే పార్టీ కార్యక్రమాలతో పాటు వ్యక్తగత విషయాల కారణంగా విజయ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించడం సంచలనం సృష్టించింది. విజయ్ టీవీకే పార్టీని స్థాపించి తమిళనాడు ఎన్నికల్లో పోటీకి దిగిన క్రమంలో సంగీత విడాకులు కోరడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గత కొన్ని రోజులుగా దీనిపై చర్చ జరుగుతోంది. విడాకులకు దారి తీసిన అంశాలపై పలు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే సంగీత దాఖలు చేసిన విడాకులు కేసుపై తాజాగా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఏప్రిల్ 19న విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. అయితే ఆ రోజు సంగీతతో పాటు విజయ్ కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున విజయ్ వ్యక్తిగతంగా హాజరు కాలేడని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవుతారని ఆయన తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు.
అయితే అందుకు అంగీకరించని కోర్టు ఖచ్చితంగా విజయ్ జూన్ 15న కోర్టులో హాజరు కావాల్సిందేనని స్ఫష్టం చేసింది. దీంతో విజయ్ ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్ 15న సంగీతతో కలిసి కోర్టుకు హాజరు కావడం తప్ప వేరే ఆప్షన్ లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విడాకుల నేపథ్యంలో విజయ్, సంగీత మధ్య సెటిల్‌మెంట్ జరిగిందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో విజయ్ వెల్లడించిన ఆస్తుల వివరాలని బట్టి తనకు భరణంగా సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు కావాలని సంగీత డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది.
అయితే విజయ్ మాత్రం సంగీతకు సెటిమెంట్ కింద రూ.35 కోట్లు ఇచ్చేందుకు సుముఖతని వ్యక్తం చేశారని, అంతే కాకుండా తన కుమారుడు, కుమార్తెల బాధ్యతను తాను తీసుకుంటానని మాట ఇచ్చారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23న జరగనున్నాయి. మే 4న కౌంటింగ్‌ను ప్రారంభించి ఫలితాలని వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 15కు ముందు ఫలితాల కారణంగా చాలా సమీకరణాలు మారనున్నాయి. ఈ నేపథ్యంలో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఆదేశాల మేరకు విజయ్ కోర్టులో హాజరవుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
