దేవరకొండ ఆవేదన వెనక లాజిక్ అర్థమైందా?
మంచి నటీనటులు, సంగీతం, భారతీయ మూలాలతో సినిమాలను చూడటానికి తాను ఇష్టపడతానని దేవరకొండ అన్నారు.
By: Tupaki Desk | 3 May 2025 10:44 AM ISTటాలీవుడ్ లో ప్రతిభావంతుడైన హీరోగా విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అతడిలో పాన్ ఇండియా ఆకర్షక శక్తి ఉంది. పైగా మంచి మాటకారి..వేదికలపై అద్భుతంగా మాట్లాడగలడు.. ప్రపంచాన్ని ఆకర్షించగలడు. కానీ ప్రతిభ ఎంత ఉన్నా తనలోనూ ఒక లోపం ఉందని వేవ్స్ 2025 సమ్మిట్ వేదికపై నిజాయితీగా అంగీకరించాడు.
కరణ్ -కరీనాకపూర్ వంటి దిగ్గజాలతో కలిసి చర్చల్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తాను అంతర్ముఖుడిని కావడం వల్ల ఎక్కువమందిని కలవలేనని, దానివల్ల అవకాశాల పరిధి తగ్గిందని అన్నాడు. అరుదుగా ఇతరులను కలవడం.. తక్కువగా బయట తిరగడం.. చిన్న సర్కిల్ కారణంగా ఇతరుల్లా ఎదగడం సాధ్యపడదని వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఆంగ్ల భాషతో ప్రపంచానికి ఉన్న సంబంధం కారణంగా, హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ తనకంటే వంద రెట్లు అధిక పారితోషికం తీసుకుంటున్నాడని, అంత పెద్ద కమ్యూనికేషన్ తనకు లేదని అన్నాడు. పెద్ద దర్శకులకు పెద్ద బడ్జెట్లు అందుబాటులో ఉంటాయి.
బ్రాడ్ చేసే సినిమాలు అన్ని చోట్లా ఆడటానికి కారణం భాషతో ఉన్న సంబంధమేనని కూడా వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఆంగ్ల భాషా చిత్రాలకు ప్రపంచవ్యాప్త రీచ్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. దాని కారణంగా పారితోషికాల వ్యత్యాసం డిసైడ్ అయిందని అన్నాడు.
ఏది ఏమైనా దేవరకొండ ఆవేదన వెనక లాజిక్ ని మనం అర్థం చేసుకోవాలి. మన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరు ప్రజలకు చేరువ కావడం చాలా ముఖ్యం. దానిని బట్టి హీరోల ఆదాయం కూడా పెరుగుతుందని గ్రహించాలి. మంచి నటీనటులు, సంగీతం, భారతీయ మూలాలతో సినిమాలను చూడటానికి తాను ఇష్టపడతానని దేవరకొండ అన్నారు. అయితే అది తన కబీ ఖుషి కబీ ఘమ్ లా ఉండాలని కరణ్ జోహార్ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆ సినిమా చాలా మంచి సినిమా అని, దాని కారణంగానే కరణ్ ని ఎక్కువమంది ప్రేమిస్తారని విజయ్ అన్నారు.
