Begin typing your search above and press return to search.

VDతో ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఇక క‌ష్ట‌మే?

అందులో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ ప్రాజెక్ట్ కూడా చేరిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 May 2025 11:30 AM
VDతో ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఇక క‌ష్ట‌మే?
X

కొన్ని క్రేజీ కాంబినేష‌న్‌ల‌తో భారీ ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టించడం టాలీవుడ్‌లో ఆన‌వాయితీగా మారింది. క్రేజీ హీరో, టాప్ డైరెక్ట‌ర్‌ల‌తో భారీ ప్రాజెక్ట్‌లు ప్ర‌క‌టించి ప్రేక్ష‌కుల్లో, బిజినెస్ ప‌రంగా ట్రేడ్ వ‌ర్గాల్లోక్రేజ్‌ని సొంతం చేసుకోవ‌డం, ఆ క్రేజ్‌తో భారీ స్థాయిలో బిజినెస్ చేసుకోవ‌డం తెలిసిందే. అయితే అలా ప్ర‌క‌టించిన కొన్ని ప్రాజెక్ట్‌లు ఆ త‌రువాత కార్య‌రూపం దాల్చ‌నివి చాలానే ఉన్నాయి. కొన్ని మాత్రం ప‌ట్టాలెక్కితే మ‌రి కొన్ని మాత్రం ఎటూ తేల్చ‌కుండా సైలెంట్ అయిన‌వి కూడా ఉన్నాయి.

అందులో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ ప్రాజెక్ట్ కూడా చేరిన‌ట్టుగా క‌నిపిస్తోంది. 2020లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేప‌థ్యంలో ఓ భారీ పీరియాడిక్ పిల్మ్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్లాన్ చేశారు. దీనికి అల్లు అర్జున్ ఫ్రెండ్ కేదార్ సెల‌గం శెట్టి నిర్మాత‌గా ముందుకొచ్చారు. అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. కానీ ప్రాజెక్ట్ ఏళ్లు గ‌డుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు.

దీంతో ఈ ప్రాజెక్ట్ ఇక ఆగిపోయిన‌ట్టేన‌ని వార్తలు షికారు చేశాయి. ఆ స‌మ‌యంలో నిర్మాత కేదార్ సెల‌గం శెట్టి స్పందించారు. విజ‌య్ దేవ‌ర‌కొండతో సుకుమార్ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని, ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేద‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై వ‌స్తున్న రూమ‌ర్‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. అయినా స‌రే నెల‌లు గ‌డుస్తున్నా ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి క‌ద‌లిక లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ ఈ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇదే స‌మ‌యంలో నిర్మాత కేదార్ సెల‌గం శెట్టి దుబాయ్‌లో మృతి చెంద‌డంతో ఇక ఈ ప్రాజెక్ట్ ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది.

భారీ స్థాయిలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సుకుమార్‌తో ఈ పీరియాడిక్ ఫిల్మ్‌ని చేయాల‌నుకున్న నిర్మాత అక‌స్మాత్తుగా మృతి చెంద‌డంతో ఈ సినిమా ఇక క‌ష్ట‌మే అనే క్లారిటీ వ‌చ్చేసింది. ప్రొడ్యూస‌రే లేన‌ప్పుడు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంద‌ని, ఒక వేళ సుక్కు మ‌రో ప్రొడ్యూస‌ర్‌తో చేయాల‌నుకుంటే త‌ప్ప విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ ప్రాజెక్ట్ క‌ష్ట‌మేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. మరి `పుష్ప 2` త‌రువాత రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిన సుకుమార్.. విజ‌య్‌తో అనుకున్న ప్రాజెక్ట్‌ని మ‌రో నిర్మాతో చేస్తారా? లేక ఆ ప్రాజెక్ట్‌ని అలాగే వ‌దిలేస్తారా? అన్న‌ది తెలియాలంటే సుక్కు స్పందించేంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే.