విజయ్‌పై ట్రోలింగ్.. అప్పుడలా ఇప్పుడిలా
ఇటీవల విజయ్ ఇంటర్వ్యూల్లో ఒకప్పటిలా యాటిట్యూడ్, అగ్రెషన్ చూపించట్లేదు. బదులుగా అతను విక్టిక్ కార్డ్ ప్లే చేయడానికి, సింపతీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనే చర్చ మొదలైంది.
By: Tupaki Desk | 10 July 2025 8:15 AM ISTసోషల్ మీడియా వల్ల కొన్నిసార్లు ఎక్కడలేని పాపులారిటీ వస్తుంది. కానీ ఏదైనా తేడా జరిగితే అదే సోషల్ మీడియా చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హీరోలకు ఇక్కడ ఒక్కోసారి ఎంత ఎలివేషన్ వస్తుందో.. కొన్నిసార్లు వారి చుట్టూ అంతకు మించిన నెగెటివిటీ ముసురుకుంటుంది. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ రెండు రకాల అనుభవాలూ చూసిన వాడే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన అతడికి ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎంతో అడ్వాంటేజ్ అయింది. తనకే సొంతమైన యాక్టింగ్, యాటిట్యూడ్‌తో అతను ఫాలోయింగ్ పెంచుకున్నాడు. చూస్తుండగానే పెద్ద స్టార్ అయిపోయాడు.
ఐతే విజయ్‌కి అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలు పడ్డపుడు సోషల్ మీడియా అతణ్ని నెత్తిన పెట్టుకుంది. కానీ తర్వాత స్థాయికి తగ్గ సినిమాలు చేయనపుడు అతడి పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు నెటిజన్లు. గతంలో తన యాటిట్యూడ్‌కు ఎలివేషన్ ఇచ్చిన వాళ్లే.. తర్వాత అది శ్రుతి మించుతోందంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ‘లైగర్’ సినిమా గురించి విజయ్ ముందు చేసిన కామెంట్లకు, సినిమాలో ఉన్న కంటెంట్‌కు పొంతన లేకపోవడంతో సోషల్ మీడియ ా అతణ్ని ఆడేసుకుంది. దీంతో ఆ తర్వాత విజయ్ తీరు మారింది. ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తగ్గించుకుని అణకువతో మెలగడానికి ప్రయత్నించాడు.
ఇటీవల విజయ్ ఇంటర్వ్యూల్లో ఒకప్పటిలా యాటిట్యూడ్, అగ్రెషన్ చూపించట్లేదు. బదులుగా అతను విక్టిక్ కార్డ్ ప్లే చేయడానికి, సింపతీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనే చర్చ మొదలైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వారసత్వ హీరోలకు ఉండే లగ్జరీస్ తనకు లేవంటూ.. ఒక కథ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసి, సినిమాను వాయిదా వేయించలేనని చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా తన ఫెయిల్యూర్లకు అతను సాకులు వెతుకుతున్నాడనే అభిప్రాయం వ్యక్తమైంది.
కెరీర్ ఆరంభంలోనే పెద్ద స్టార్‌గా ఎదిగి, కావాల్సిన సపోర్ట్ సిస్టం అంతా సంపాదించుకున్న విజయ్.. పెద్ద పెద్ద బేనర్లలో సినిమాలు చేసి కూడా. వారసత్వ హీరోలతో పోల్చి తన కష్టాల గురించి మాట్లాడ్డం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కథల ఎంపికలో చేసిన తప్పులను అంగీకరించి, దిద్దుబాటు చేసుకోకుండా.. ఇలా సాకులు వెతకడం, వారసత్వ హీరోలను బూచిగా చూపించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని.. కెరీర్లో ఈ దశలో అతను సింపతీ కోసం ప్రయత్నించడం వ్యర్థమని నెటిజన్లు అతణ్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు యాటిట్యూడ్ విషయంలో విజయ్‌ని ట్రోల్ చేసిన వాళ్లు.. ఇప్పుడు అతను విక్టిక్ కార్డ్ వాడుతున్నాడంటూ మండిపడుతున్నారు.
