'డాన్ 3' విలనీ: VD ఎగ్జిట్‌కి కారణమేమిటి?
కింగ్ ఖాన్ షారూఖ్ ని కాదనుకుని ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ ని డాన్ పాత్రలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఫర్హాన్ అక్తర్.
By: Tupaki Desk | 16 July 2025 6:00 AM ISTకింగ్ ఖాన్ షారూఖ్ ని కాదనుకుని ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ ని డాన్ పాత్రలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఫర్హాన్ అక్తర్. అతడు `డాన్` ఫ్రాంఛైజీలో మూడో భాగం `డాన్ 3`ని ప్రకటించి చాలా కాలమే అయినా చిత్రీకరణ ప్రారంభం కావడానికి ఏళ్లుగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాకు సరైన విలన్ దొరక్కపోవడం నిరాశపరుస్తోంది. షారూఖ్ మొదటి రెండు భాగాల్లో అద్భుత నటనతో ప్రజల్ని అలరించాడు. ఇప్పుడు రణ్ వీర్ ఈ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలన్న ఆసక్తి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ అంతకంతకు ఆలస్యమవుతున్నట్టే కనిపిస్తోంది.
డాన్ 3లో విలన్ గా ప్రతిభావంతుడైన యువనటుడు విక్రాంత్ మాస్సేకు అవకాశం కల్పించినా తిరస్కరించాడని కథనాలొచ్చాయి. సృజనాత్మక అసంతృప్తి కారణంగా విక్రాంత్ ఈ పాత్రను వదులుకున్నట్టు ప్రచారం సాగుతోంది. అతడు రిజెక్ట్ చేసాక, అదే పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను దర్శకనిర్మాతలు సంప్రదించారని కూడా కథనాలొచ్చాయి. వీడీ కూడా ఈ పాత్రను కాదనుకున్నాడు. ప్రస్తుతం దేవరకొండ తెలుగులో వరుస చిత్రాలకు కాల్షీట్లు ఇచ్చాడు. అలాగే దీర్ఘ కాలిక ప్రణాళిక ప్రకారం ఈ విలన్ పాత్ర తన ఇమేజ్ కి ఇబ్బందులు క్రియేట్ చేస్తుందని కూడా అతడు భావించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా కానీ, ఒక భారీ యాక్షన్ చిత్రంలో విక్రాంత్ మాస్సే, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు నటించే అవకాశాల్ని వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. ఫర్హాన్ బృందం తదుపరి ఈ పాత్ర కోసం వేరొక నటుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సృజనాత్మక వైరుధ్యాలు, పాత్ర పరిమితులు, హీరో ఇమేజ్ వగైరా అంశాలు ఈ వైఫల్యానికి కారణం కావొచ్చు. దానిని సరిదిద్ధుతూ సరైన నటుడిని ఈ పాత్రకు ఎంపిక చేయాల్సి ఉంటుంది.
రణ్ వీర్ సింగ్ లాంటి ఎనర్జిటిక్ హీరోకు మ్యాచ్ చేసేలా భీకర విలన్ గా ఢీకొట్టడానికి విజయ్ దేవరకొండ సరిపోతాడు. కానీ అతడు నిరాకరించడానికి కారణం ఆ పాత్రను ఆశించినంత పవర్ ఫుల్ గా డిజైన్ చేయకపోవడమేనని భావిస్తున్నారు. అయితే రణ్ వీర్ ఫ్యాషన్ సెన్స్ ని ఫాలో చేసే హీరోగా వీడీకి గుర్తింపు ఉంది. అందుకే భవిష్యత్ లో ఆ ఇద్దరూ కలిసి నటించాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
