Begin typing your search above and press return to search.

రణబాలిపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్.. రిలీజ్‌కు ముందే విన్నింగ్ వైబ్స్!

వంద రోజుల షూటింగ్‌ను స‌క్సెస్‌ఫుల్ గా పూర్తి చేసుకున్న ర‌ణ‌బాలి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశ వైపు వేగంగా అడుగులేస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 Jun 2026 1:58 PM IST
రణబాలిపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్.. రిలీజ్‌కు ముందే విన్నింగ్ వైబ్స్!
X

పాన్ ఇండియా సినిమాల పోటీలో ప్రత్యేకమైన కథాంశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్ట‌ర్లు కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి ఒకటి. చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ భారీ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమా నిర్మాణ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

వంద రోజుల షూటింగ్‌ను స‌క్సెస్‌ఫుల్ గా పూర్తి చేసుకున్న ర‌ణ‌బాలి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశ వైపు వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యన్ రూపొందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తోంది. 19వ శతాబ్దపు భారతదేశాన్ని నేపథ్యంగా తీసుకుని, బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

1854 నుంచి 1878 మధ్యకాలంలో చోటుచేసుకున్న సామాజిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గండికోట పరిసర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. దాదాపు వారం రోజుల పాటు సాగిన ఈ షూటింగ్ లో ప్రధానంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలపై ఎమోష‌న‌ల్ సీన్స్ ను షూట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. సినిమా కథలో ఈ ఎపిసోడ్లు కీలక మలుపులు తీసుకురానున్నాయని స‌మాచారం.

ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన దాదాపు 90% షూటింగ్ పూర్తైన‌ట్లు తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరలో పూర్తి చేసి, త‌ర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ ను వేగవంతం చేయాలని మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. ఇటీవల విజయ్ దేవరకొండ బ‌ర్త్ డే సందర్భంగా రిలీజైన గ్లింప్స్‌కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా అందులో చూపించిన యాక్షన్ సీన్స్, పీరియాడిక్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

రశ్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్ట‌ర్ ఆర్నాల్డ్ వోస్లూ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుల ద్వయం అజయ్- అతుల్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకోవడం, ప్రచార కార్యక్రమాలు కూడా క్రమంగా వేగం అందుకోవడం చూస్తుంటే రణబాలి ఈ ఇయ‌ర్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.