Begin typing your search above and press return to search.

బీటౌన్ ప్రొడక్షన్ హౌస్ తో దేవరకొండ.. అదేనా టార్గెట్?

ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ లో విజయ్ కనిపించడంతో.. కొత్త ప్రాజెక్ట్‌ పై చర్చలు మొదలయ్యాయి.

By:  M Prashanth   |   29 May 2026 10:37 AM IST
బీటౌన్ ప్రొడక్షన్ హౌస్ తో దేవరకొండ.. అదేనా టార్గెట్?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేశారు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ.. మార్కెట్‌ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌ పై రెండు సినిమాలు ఉండగా.. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆఫీస్ లో కనిపించడం హాట్ టాపిక్‌ గా మారింది. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ లో విజయ్ కనిపించడంతో.. కొత్త ప్రాజెక్ట్‌ పై చర్చలు మొదలయ్యాయి.

నిజానికి విజయ్ దేవరకొండ లైనప్ చూస్తే.. పూర్తిగా పాన్ ఇండియా మార్కెట్‌ పైనే ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఒకవైపు రణబాలి, మరోవైపు రౌడీ జనార్థన, అలాగే దర్శకుడు శౌర్యువ్‌ తో కొత్త సినిమా.. ఇలా మూడు ప్రాజెక్టులు కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. అయితే 19వ శతాబ్దం బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న రణబాలి చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తున్నారు. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది.

ఇక రౌడీ జనార్థన విషయానికొస్తే.. గ్రామీణ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. దర్శకుడు రవి కిరణ్ కోలా పాన్ ఇండియా రేంజ్‌ లో ప్లాన్ చేస్తున్నారు. ఆ రెండు సినిమాల మధ్యలోనే శౌర్యువ్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌ ను ప్రకటించడం విజయ్ ప్లానింగ్‌ పై మరింత ఆసక్తి పెంచింది. ఇప్పుడు అసలు చర్చ అంతా మాడాక్ ఫిల్మ్స్ చుట్టూనే తిరుగుతోంది. బాలీవుడ్‌ లో గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నిర్మాత దినేష్ విజన్ ఆధ్వర్యంలోని ఆ బ్యానర్ హిందీ మార్కెట్‌ లో స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించుకుంది.

వరుసగా కంటెంట్ బేస్డ్ సినిమాలతో పాటు భారీ కమర్షియల్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోంది. అలాంటి బ్యానర్ ఆఫీస్ లో విజయ్ కనిపించడం యాదృచ్ఛికమా? లేక నిజంగానే కొత్త ప్రాజెక్టుకు చర్చ జరిగిందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రష్మిక మందన్న ఇప్పటికే మాడాక్ ఫిల్మ్స్‌ తో థమ్మా, కాక్‌ టెయిల్ 2 వంటి చిత్రాల్లో వర్క్ చేస్తుండటం కూడా ఆ చర్చలకు మరింత బలం చేకూరుస్తోంది. దీంతో విజయ్-ర ష్మిక కాంబినేషన్‌ లో మరో భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో విజయ్ కోసం ప్రత్యేకంగా హిందీ మార్కెట్‌ ను టార్గెట్ చేసిన కొత్త కథను సిద్ధం చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత హిందీ ప్రేక్షకుల్లో విజయ్‌ కు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ క్రేజ్‌ ను పూర్తి స్థాయిలో మార్కెట్‌ గా మార్చుకోవడంలో ఇప్పటివరకు ఆయనకు సరైన బ్రేక్ రాలేదు. అయితే మాడాక్ ఫిల్మ్స్‌ తో నిజంగా ఏం చర్చలు జరిగాయి? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఫైనల్ అయ్యిందా? అన్నదానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.