Begin typing your search above and press return to search.

పోయి టాప్‌లో కూచుంటా.. రౌడీ కొండ శ‌ప‌థం

మీ అంద‌రికీ ఓ మాట చెప్పాలి. ఏడాది నుంచి మా సినిమా రిలీజ్ గురించి ఆలోచిస్తుంటే నా త‌ల‌కాయ‌లో ఒక‌టే తిరుగుతోంది.

By:  Tupaki Desk   |   26 July 2025 10:40 PM IST
పోయి టాప్‌లో కూచుంటా.. రౌడీ కొండ శ‌ప‌థం
X

లైగ‌ర్ - ఖుషి- ది ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ ఈసారి చాలా శ్ర‌మించాడు. ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌నే క‌సి పంతంతో `కింగ్ డ‌మ్` కోసం హార్డ్ వ‌ర్క్ చేసాడు. ఈ సినిమా కోసం అత‌డి మేకోవ‌ర్ కూడా ఆశ్చ‌ర్య‌క‌రం. ప‌ర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీతో క‌నిపిస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు కింగ్ డ‌మ్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈరోజు తిరుప‌తి వెంకటేశుని చెంత ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు విజ‌య్. ఒక్క క్ష‌ణం క‌ళ్లు ఎరుపెక్క‌గా, అత‌డు త‌న శ్ర‌మ‌ను, వెయిటింగ్ ని గుర్తు చేసుకున్నాడు.

ఈసారి మీ కాడికే వ‌చ్చినా.. మీ అంద‌రిని క‌లిసినా.. అంటూ తిరుప‌తి- రాయ‌ల‌ సీమ యాస‌లో మాట్లాడాడు. మీ అంద‌రితో పాటు ట్రైల‌ర్ చూసాను. మీ అరుపులు కేక‌లు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోందని ఆనందం వ్య‌క్తం చేసాడు విజ‌య్ దేవ‌రకొండ‌. ఇంకా అత‌డి స్పీచ్ ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా సాగింది.

మీ అంద‌రికీ ఓ మాట చెప్పాలి. ఏడాది నుంచి మా సినిమా రిలీజ్ గురించి ఆలోచిస్తుంటే నా త‌ల‌కాయ‌లో ఒక‌టే తిరుగుతోంది... మ‌న తిరుప‌తి ఏడుకొండ‌ల వెంక‌న్న సామి కానీ ఈ ఒక్క‌సారికి నా ప‌క్క‌న ఉండి న‌డిపించినాడో చానా పెద్దోడినై పొడుస్తాను సామీ.. పోయి టాప్ లో కూచుంటా! అంటూ తిరుప‌తి యాస‌ను ప‌లికించే ప్ర‌య‌త్నం చేసాడు.

ప్ర‌తిసారిలా పాణం పెట్టి పూర్తిగా ప‌ని చేసినా.. ఈసారి నా సినిమాని చూస్కోవ‌డానికి మంచోళ్లే ఉన్నారు. మా డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి, మా పాలెగాడు అనిరుధ్, న‌వీన్ నూలి, నాగ‌వంశీ ఉన్నారు. మా నిర్మాత‌ నాగ‌వంశీ ఇంట‌ర్వ్యూలు వ‌రుస‌గా చంపాడు. అంద‌రూ పాణం పెట్టి ప‌ని చేసారు. ఇప్ప‌టిదాకా పని చేస్తూనే ఉన్నారు... అంటూ టిపిక‌ల్ సీమ భాష‌ను ఉప‌యోగించాడు.

ఇక మిగిలింది రెండే .. ఆ వెంక‌న్న సామి ద‌య‌.. మీ అంద‌రి ఆశీస్సులు.. ఈ రెండూ నాతో ఉంటే, ఎవ‌రూ మ‌న‌ల్ని ఆపేదేలే.. నాలుగు రోజులే స‌మ‌యం ఉంది. నెలాఖ‌రుకి మీ అంద‌రినీ థియేట‌ర్ల‌లో క‌లుస్తున్నాను. అప్ప‌టివ‌ర‌కూ మ‌మ్మ‌ల్ని చూసుకో స్వామీ... ! అంటూ దేవ‌ర‌కొండ త‌న స్పీచ్ ని ముగించాడు. తిరుప‌తిలో జ‌రుగుతున్న కింగ్ డ‌మ్ ఈవెంట్లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు గౌత‌మ్ తిన్న‌నూరి, అనిరుధ్, నాగ‌వంశీ స‌హా ఇత‌ర చిత్ర‌బృందం పాల్గొంది.