వివాహం తర్వాత విజయ్ తొలి స్పీచ్.. ఊరి మేలు కోసం కీలక నిర్ణయం!
గ్రామస్తులకు విందు ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ దంపతులు అనంతరం మాట్లాడుతూ గ్రామానికి వరాల.జల్లు కురిపించారు .
By: Madhu Reddy | 2 March 2026 7:59 PM ISTఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా సరే తమ మూలాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ తమ ప్రాంతాలను అభివృద్ధి పరుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు రాజాబాబు , సావిత్రి లాంటి ఎంతోమంది సీనియర్ దివంగత సెలబ్రిటీలు తమ ఊర్లను అభివృద్ధి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వారి బాటలోనే ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు కూడా తమ సొంత ఊర్లను అభివృద్ధి చేస్తూ.. ఆ గ్రామాలకు ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొస్తున్నారు.. మరి కొంతమంది ఏకంగా గ్రామాలను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా.. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వారు ఊర్లను దత్తత తీసుకొని, ఆ ఊరి అభివృద్ధికి పాటుపడుతుంటే ఇటు విజయ్ దేవరకొండ తన సొంత ఊరికి వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఆయన చేసిన కీలక ప్రకటన అభిమానులను సైతం సంతోషానికి గురిచేస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే ..దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమించుకొని ఎక్కడా మీడియాకు అధికారికంగా ప్రకటన చేయకుండా.. సడన్గా పెళ్లికి నాలుగు రోజుల ముందు అభిమానులు ముద్దుగా పెట్టిన "విరోష్" అనే పదాన్ని స్వీకరిస్తూ "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" అంటూ వివాహానికి సిద్ధమవుతున్నామని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు . ఇక అన్నట్టుగానే ఉదయ్ పూర్ లో ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం రష్మిక మందన్న మత ఆచారాల ప్రకారం కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
వివాహం అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మార్చి 4వ తేదీన హైదరాబాదులో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , భారత ప్రధాని నరేంద్ర మోదీ లను జంటగా కలిసి ఆహ్వానించారు. ఇక అనంతరం ఉదయపూర్ ఎయిర్పోర్ట్ లో మీడియా మిత్రులతో సంభాషించిన ఈ జంట.. నేరుగా నాగూర్ కర్నూలు జిల్లాలోని తన సొంత గ్రామమైన తుమ్మన్ పేటకు భార్యతో సహా విచ్చేశారు. ముఖ్యంగా ఇక్కడ కొత్తగా ఫామ్ హౌస్ నిర్మించడమే కాకుండా ఆ ఫామ్ హౌస్ లో భార్యతో కలిసి గృహప్రవేశం చేసి, అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేశారు.
గ్రామస్తులకు విందు ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ దంపతులు అనంతరం మాట్లాడుతూ గ్రామానికి వరాల.జల్లు కురిపించారు . విజయ్ దేవరకొండ వివాహం తర్వాత తొలిసారి బహిరంగంగా మాట్లాడుతూ.. "పెళ్లి చేసుకున్న తర్వాత ఊర్లో పదిమందికి ఏదో మంచి చేయాలనిపించింది.. అందులో భాగంగానే "దేవరకొండ ఫౌండేషన్" ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ ,సెకండ్ ర్యాంకుల్లో స్థానాలు సంపాదించుకుంటారో వారికి ఈ ఏడాది నుంచి స్కాలర్షిప్ అందిస్తాము" అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించారు.
అనంతరం ఊరి అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ.. "చాలా ఏళ్ల తర్వాత సొంత ఊరిలో ఇల్లు కట్టుకోవడం , పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్ గా వస్తాము. ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేద్దాము.. తరచూ గ్రామానికి వస్తూ ఉంటాము. కచ్చితంగా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం" అంటూ ఊరి ప్రజలకు శుభవార్త తెలిపారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆయన అభిమానులు, నెటిజన్స్ విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
