స్టార్ లైఫ్‌పై ఆసక్తి లేదు.. పల్లెటూరి బాట పడుతున్న హీరో
నగరాల్లో మాల్స్, ఎంటర్టైన్మెంట్, సౌకర్యాలు పెరిగినా మానసిక ప్రశాంతత మాత్రం క్రమంగా దూరమవుతోందని ఆయన అభిప్రాయపడటం ప్రస్తుత జీవనశైలిపై ఒక గట్టి సందేశంగా కనిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Jun 2026 2:00 PM ISTబిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన నటుడు విజయ్ ఆంటోనీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం తన కొత్త సినిమా నూరుసామి (తెలుగులో వంద దేవుళ్లు) ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆయన, మరో రెండు మూడు సంవత్సరాల్లో చెన్నై నగర జీవితానికి, సినీ పరిశ్రమ హడావిడికి గుడ్‌బై చెప్పి పల్లెటూరిలో స్థిరపడాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సాధారణ జీవితం గడపడంపైనే తనకు ఆసక్తి ఉందని, అందుకోసం గ్రామాల్లో భూముల కోసం ఇప్పటికే అన్వేషిస్తున్నట్లు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్ ఆంటోనీ వ్యాఖ్యల్లో ప్రధానంగా కనిపించిన అంశం సింపుల్ లైఫ్ ఫిలాసఫీ. ఎంతో మంది అభిమానులు, స్టార్‌డమ్, పేరు, ప్రతిష్ఠ, ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ నిజమైన ఆనందం మాత్రం ప్రశాంతమైన జీవితంలోనే ఉందని ఆయన నమ్ముతున్నట్లు స్పష్టమవుతోంది. గ్రామాల్లోని స్వచ్ఛమైన గాలి, ప్రకృతితో అనుబంధం, మనుషుల మధ్య ఉండే ఆత్మీయత తనను బాగా ఆకర్షించాయని ఆయన చెప్పడం గమనార్హం. నగరాల్లో మాల్స్, ఎంటర్టైన్మెంట్, సౌకర్యాలు పెరిగినా మానసిక ప్రశాంతత మాత్రం క్రమంగా దూరమవుతోందని ఆయన అభిప్రాయపడటం ప్రస్తుత జీవనశైలిపై ఒక గట్టి సందేశంగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండే జీవనశైలిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫార్మ్ హౌస్‌లు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసి నగర రద్దీకి దూరంగా జీవించాలనే ఆలోచన చాలామందిలో కనిపిస్తోంది. ఆ లిస్ట్‌లో ఇప్పుడు విజయ్ ఆంటోనీ కూడా చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నూరుసామి సినిమాలో రైతు పాత్ర పోషించిన తర్వాత గ్రామీణ జీవితం పట్ల ఆయనకు మరింత మక్కువ పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కల్లకురిచ్చి ప్రాంతంలో షూటింగ్ టైమ్ లో అక్కడి వాతావరణం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన చెప్పడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.
అయితే విజయ్ ఆంటోనీ వ్యాఖ్యలు అభిమానుల్లో కొంత ఆందోళనను కూడా కలిగిస్తున్నాయి. ఆయన మాటలు కేవలం చెన్నైని విడిచి వెళ్లడంపైనేనా, లేక క్రమంగా సినీ పరిశ్రమకు కూడా దూరమవుతాననే సంకేతమా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే మూడేళ్ల క్రితం తన కూతురు చనిపోయిన తర్వాత ఆయన సినిమాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఆ వ్యక్తిగత విషాదం జీవితాన్ని మరో కోణంలో చూసేలా చేసిందని, ఇప్పుడు ప్రశాంతత కోసం కొత్త జీవన విధానాన్ని ఎంచుకోవాలని భావిస్తున్నారని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే ఆయన తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళనతో పాటు ఆసక్తిని కూడా రేకెత్తిస్తున్నాయి.
మరోవైపు యూత్ కు కూడా విజయ్ ఆంటోనీ మాటల్లో ఒక ముఖ్యమైన మెసేజ్ కనిపిస్తోంది. మంచి ఉద్యోగాలు, సౌకర్యాలు, కెరీర్ అవకాశాల కోసం నగరాల వైపు పరుగులు తీస్తున్న నేటి తరానికి గ్రామ జీవితం విలువను గుర్తించాలని ఆయన సూచిస్తున్నారు. నగరాల్లో ఒత్తిడి, కాలుష్యం, పోటీ పెరుగుతుండగా గ్రామాల్లో ఇంకా సహజత్వం, మానవ సంబంధాలు, ప్రశాంతత మిగిలి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి స్టార్‌డమ్ అందుకున్న ఒక నటుడు ఇలాంటి మాటలు చెప్పడం సమాజంలో మారుతున్న జీవన విలువలపై కొత్త చర్చకు దారితీస్తోంది.
