మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు ఆ సత్తా ఉంది
ఈ సందర్భంగా మీడియా నుంచి ఒకరు మీరు ఆల్రెడీ తెలుగులో మహాత్మ, దరువు లాంటి సినిమాలకు మ్యూజిక్ చేశారని,
By: Tupaki Desk | 27 Jun 2025 12:41 AM ISTతమిళ నటుడు విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మార్గన్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. లియో జాన్ పాల్ గతంలో పలు సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసి, ఇప్పుడు మార్గన్ తో డైరెక్టర్ గా మారారు. జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ బ్యానర్ లో విజయ్ ఆంటోనీనే నిర్మించారు.
ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాతో ముచ్చటించిన విజయ్ ఆంటోనీ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. మంచి కంటెంట్ తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదిరిస్తారని, బిచ్చగాడు సినిమా లానే మార్గన్ కూడా మంచి హిట్ అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలోనూ భాగమవుతూ, కథను, అందులో పాత్రను బాగా అర్థం చేసుకున్న తర్వాతే సినిమాలను ఎంపిక చేసుకుంటానని విజయ్ ఆంటోనీ తెలిపారు.
ప్రస్తుతం తాను ఆరు సినిమాలకు కమిట్ అయినట్టు వెల్లడించిన విజయ్ ఆంటోనీ మళ్లీ తన దర్శకత్వంలో సినిమా అంటే అది బిచ్చగాడు3నే అని, 2027 సమ్మర్ లో బిచ్చగాడు3 రిలీజ్ కానుందని తెలిపారు. ఫస్ట్ రెండు పార్టుల కంటే బిచ్చగాడు మూడో పార్ట్ భిన్నంగా ఉండబోతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ హీరోగా సినిమాలు చేస్తూ మ్యూజిక్ పై కాస్త ఫోకస్ తగ్గిందని, ఇక మీదట మ్యూజిక్ పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు విజయ్ ఆంటోనీ తెలిపారు.
ఈ సందర్భంగా మీడియా నుంచి ఒకరు మీరు ఆల్రెడీ తెలుగులో మహాత్మ, దరువు లాంటి సినిమాలకు మ్యూజిక్ చేశారని, ఇప్పుడు మీరు తెలుగులో సినిమా చేస్తే ఏ హీరోతో చేస్తారని విజయ్ ఆంటోనీని అడగ్గా, ఆయన దానికి స్పందిస్తూ, అది మీరే చెప్పాలని, తానెవరితో సినిమా చేస్తే బావుంటుందని మీరు కోరుకుంటున్నారో చెప్పమని అడగ్గా జూ. ఎన్టీఆర్ పేరు చెప్తూ, మీరు ఏ సినిమాకు వర్క్ చేసినా మాకు ఇష్టమేనని, మీరు తెలుగులో కూడా మ్యూజిక్ చేయడమే మాకు కావాలని సదరు జర్నలిస్ట్ చెప్పారు.
ఈ విషయంపై విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ, తనకు స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ చేసే సత్తా ఉందని, తన సినిమాలకు తాను మ్యూజిక్ చేసుకుంటున్న తరుణంలో తనకు మాస్ స్కేల్ లేనందున ఆ తరహా సాంగ్స్ చేయలేకపోతున్నానని, కానీ స్టార్ హీరోకు వర్క్ చేస్తే వారి మార్కెట్ ను బట్టి మాస్ సాంగ్, ఐటెం సాంగ్ సహా ఎలాంటి పాటనైనా ఇచ్చే కేపబులిటీ తనకుందని, భద్రకాళి సినిమా తర్వాత మ్యూజిక్ పై ఎక్కువ ఫోకస్ చేయనున్నట్టు విజయ్ ఆంటోనీ తెలిపారు.
