ఆంటోనీ సార్ ఈసారైనా కంటెంట్ ఉంటుందా..!
అయిదు సినిమాల్లో మొదటగా 'మార్గన్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
By: Tupaki Desk | 22 May 2025 4:00 PM ISTసంగీత దర్శకుడిగా కోలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించిన విజయ్ ఆంటోనీ ప్లే బ్యాక్ సింగర్‌గా, ఎడిటర్‌గా, రచయితగా, ఆడియో ఇంజనీర్‌గా ఎన్నో విధాలుగా వర్క్ చేశాడు. అదే సమయంలో నటనపై ఆసక్తి పెంచుకుంటూ వచ్చాడు. కెరీర్ ఆరంభం నుంచే సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడం, ముఖ్య పాత్రల్లో కనిపించడం చేశారు. సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న సమయంలోనే హీరోగానూ పరిచయం అయ్యాడు. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన విజయ్ ఆంటోనీ మొదట్లో హిట్లు దక్కించుకున్నాడు. తెలుగులో బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీకి మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది.
టాలీవుడ్‌లో బిచ్చగాడు సినిమాతో దక్కిన గుర్తింపుతో మంచి మార్కెట్‌ను దక్కించుకున్న విజయ్ ఆంటోనీ ప్రతి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్‌లలో విడుదల చేస్తూ వచ్చారు. గత ఏడాది ఆయన నటించిన మూడు సినిమాలను కూడా డీసెంట్ నెంబర్ థియేటర్‌లలో విడుదల చేశారు. కానీ బిచ్చగాడు తర్వాత బిచ్చగాడు 2 సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించిన విజయ్ ఆంటోనీ ఆ మధ్యలో, ఆ తర్వాత ఒక్క సినిమాతోనూ ఆకట్టుకోలేక పోయాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా విజయ్ ఆంటోనీ సినిమాలు ఆడటం లేదు. ఏడాదిలో రెండుకు తగ్గకుండా సినిమాలతో వస్తున్న ఈ హీరో ప్రస్తుతం ఏకంగా అయిదు సినిమాలు చేస్తున్నాడు.
అయిదు సినిమాల్లో మొదటగా 'మార్గన్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెడికో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇదే సమయంలో విజయ్ ఆంటోనీ సినిమాలన్నీ ప్రమోషనల్ స్టఫ్ అంటే టీజర్, ట్రైలర్, పోస్టర్స్ బాగుంటాయి. కానీ కంటెంట్ మాత్రం ఉండటం లేదు. ప్రమోషన్ కోసం ఉపయోగించే తెలివి తేటలు సినిమా మేకింగ్ విషయంలో లోపిస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన రోమియో, మళై పిడిక్కథ మనితాన్, హిట్లర్ సినిమాలు ప్రమోషన్ సమయంలో అంచనాలు పెంచినా తీరా విడుదలైన తర్వాత నిరాశ పరిచాయి.
మార్గన్ సినిమా విషయంలో అలా జరగకుండా చూసుకోవాలంటూ విజయ్ ఆంటోనీ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేకింగ్ విషయంలో విజయ్ కాస్త శ్రద్ద పెడితే తప్పకుండా మంచి సినిమా వస్తుందని, ఆయన కేవలం ఇతర సినిమాల ఎంపిక, ప్రమోషన్ పై దృష్టి పెట్టవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటున్న విజయ్ ఆంటోనీ వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విషయంలో మాత్రం ప్రతి సారి విఫలం అవుతున్నాడు. అందుకే మార్గన్ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఆయన కెరీర్ పై మరింత పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. మార్గన్ తర్వాత రాబోతున్న సినిమాల మార్కెట్ విషయంలోనూ, బిజినెస్ విషయంలోనూ తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే మార్గన్‌లో అయినా కంటెంట్ ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
