విజయ్ ఆంటోనీ సైలెంట్‌గా కానిచ్చేస్తున్నాడా?
`బిచ్చగాడు 2`ని డైరెక్ట్ చేసిన విజయ్ ఆంటోనీ `బిచ్చగాడు 3`ని కూడా డైరెక్ట్ చేస్తున్నానని తాజాగా స్పష్టం చేశాడు.
By: Tupaki Desk | 28 Jun 2025 8:55 AM ISTవిభిన్నమైన కథలని ఎంచుకుంటూ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, రైటర్‌గా, ఎడిటర్‌గా..ఇలా ఆరు శాఖలని విజయవంతంగా నిర్వహిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. 2016లో విడుదలై సంచలనం సృష్టించిన మూవీ `బిచ్చగాడు`. తమిళంలో శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సంగీత దర్శకుడిగా కొనసాగుతూ సరికొత్త కథలని ఎంచుకుంటూ వెళుతున్న విజయ్ ఆంటోనీని హీరోగా నిలబెట్టింది.
నామినల్ బడ్జెట్ లో నిర్మించిన `బిచ్చగాడు` తమిళ, తెలుగు భాషల్లో రూ.40 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో అంతా అవాక్కయ్యారు. ఇది విడుదలైన ఎనిమిదేళ్లకు విజయ్ ఆంటోనీ సీక్వెల్‌తో మరోసారి బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే దీనికి తానే డైరెక్టర్‌గా వ్యవహరించడం విశేషం. సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ `మార్గన్` మూవీలో నటించాడు. ఈ మూవీ ఈ శుక్రవారమే తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది.
తొలి రోజే సో సో టాక్‌ని సొంతం చేసుకోవడంతో రెండు భాషల్లోనూ `మార్గన్` ఆశించని స్థాయిలో వసూళ్లని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన విజయ్ ఆంటోనీ `బిచ్చగాడు సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `బిచ్చగాడు 2`ని డైరెక్ట్ చేసిన విజయ్ ఆంటోనీ `బిచ్చగాడు 3`ని కూడా డైరెక్ట్ చేస్తున్నానని తాజాగా స్పష్టం చేశాడు. అంతే కాకుండా ఈ సినిమాని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని వెల్లడించాడు.
`బిచ్చగాడు` సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ సారి సీక్వెల్‌లో విజయ్ ఆంటోనీ ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకుని సినిమా చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. `బిచ్చగాడు 3`కి కూడా విజయ్ ఆరు శాఖలని నిర్వహించబోతుండటం విశేషం. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రైటర్‌గా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా వ్యవహరించబోతున్నాడు. 2027లో థియేటర్లలోకి రానున్న ఈ మూవీని విజయ్ ఆంటోనీ సైలెంట్‌గా మొదలు పెట్టి ఫినిష్ చేస్తాడని తమిళ వర్గాలు అంటున్నాయి.
