Begin typing your search above and press return to search.

మహర్షి టికెట్లకు అప్పుడే రెక్కలు

By:  Tupaki Desk   |   25 April 2019 10:18 AM IST
మహర్షి టికెట్లకు అప్పుడే రెక్కలు
X
సరిగ్గా ఇంకో రెండు వారాల్లో మహేష్ బాబు మహర్షి విడుదల కానుంది. సంక్రాంతి తర్వాత పెద్ద రేంజ్ లో ఉన్న స్టార్ హీరో సినిమా ఏది విడుదల కాక డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు ఏప్రిల్ బాగా కలిసి వచ్చింది. వెలవెలబోతున్న ధియేటర్లకు జనం రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు మే నుంచి మహేష్ మేనియాతో నిండిపోతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా మహర్షి టికెట్లకు రెక్కలు వచ్చే అవకాశం ఉన్నట్టు టాక్. అదేంటి అని ఆశ్చర్యపోకండి. ఇక్కడ రెక్కలు అంటే రేట్లకు అని అర్థం. భారీ బడ్జెట్ తో రూపొందిన కారణంగా మహర్షి టికెట్ ధరలను వారం రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాల్సిందిగా అనుమతి కోరుతూ ఇప్పటికే పలు కేంద్రాల్లోని ధియేటర్ల యజమానులు మల్టీ ప్లెక్సుల నిర్వాహకులు కలెక్టర్లకు దరఖాస్తు చేసినట్టు సమాచారం వస్తోంది

ఉదహరణకు ఒక బి సెంటర్ లోని మల్టీ ప్లెక్స్ లో రిక్లైనర్ టికెట్ ధర 180 రూపాయలు ఉంటే అది 250 అవుతుంది. గోల్డ్ క్లాసు 110 నుంచి 150కు మూడో తరగతి 70 నుంచి 100 రూపాయలకు ఎగబాకుతుంది. ఇవి వారం రోజుల పాటు అమలులో ఉంటాయి. ఇదేమి కొత్త ప్రాక్టీసు కాదు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ సెలవుల సీజన్ లో విడుదలైన ప్రతి స్టార్ హీరో సినిమాకు జరుగుతున్నవే.

తెలంగాణాలో ఇలా అనుమతులు అరుదుగా ఇస్తున్నారు కాని ఆంధ్రప్రదేశ్ లో సాధారణం అయిపోయింది. అయితే ఎన్నికల ఫలితాలు రాని దృష్ట్యా కోడ్ ఇంకా అమలులోనే ఉంది. ఈ నేపధ్యంలో మహర్షి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా చూడాలి. రాజకీయానికి సినిమాకు సంబంధం లేనప్పటికీ ధరల పెంపు పాలనాపరమైన అంశం కాబట్టి ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి