Begin typing your search above and press return to search.

చించేసిన వేటూరి పాట సూపర్ హిట్ అయింది !

ఒక సినిమా జనాల ముందుకు వచ్చేందుకు ఎంతటి పురిటి నొప్పులు పడుతుందో చాలా మందికి తెలియదు.

By:  Satya P   |   2 Feb 2026 5:00 AM IST
చించేసిన వేటూరి పాట సూపర్ హిట్ అయింది !
X

ఒక సినిమా జనాల ముందుకు వచ్చేందుకు ఎంతటి పురిటి నొప్పులు పడుతుందో చాలా మందికి తెలియదు. అంతే కాదు ఇరవై నాలుగు క్రాఫ్టులు ఎంతో కష్టపడి మేధో మధనం చేసి మరీ తమ టాలెంట్ ని పెడతాయి. ఒకటికి వంద వేయి సార్లు ఆలోచించుకుని టెక్నీషియన్స్ తమ అవుట్ పుట్ ని ఇస్తారు. ఇక పాటల విషయానికి వస్తే గేయ రచయిత ఎంతో సాధన చేసి ఒక్కో అక్షరం పేరుస్తాడు. తాను రాసిన పాట తనకే నచ్చక రాసిన వాటిని ఎన్నో సార్లు చించేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అంతే కాదు తాను ఒకటి రాసి ఇస్తే ఫలానా దర్శకుడికి నిర్మాతకు సంగీత దర్శకుడికి నచ్చకపోయినా తీసి పక్కన పెట్టేస్తారు.

చెత్త బుట్టలోకి వెళ్ళి :

అలా ఒక తమాషాయే జరిగింది. యాభై ఏళ్ళ వెనక్కి వెళ్తే తెలుగు సినిమా సుప్రసిద్ధ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి వైభవం మొదలైన రోజులు అవి. ఆయన పాట కోసం అంతా ఎదురుచూస్తున్న నేపథ్యం అది. పెద్దా చిన్నా అన్ని సినిమాలకు ఆయన గీతం కావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక చూస్తే వేటూరి ఒక సినిమా కోసం పాట రాశారు. అయితే ఆ పాట ఆ చిత్ర పెద్దలకు నచ్చలేదు, దాంతో వేటూరి ఆ పాటను నేరుగా చెత్తబుట్టలోకి విసిరేసి కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన దర్శకుడు దాసరి నారాయణరావు సినిమాకు కూడా పనిచేస్తున్నారు. ఆ ఆఫీసులోనే చెత్త బుట్టలోకి వెటూరి పాట వెళ్ళింది.

షాక్ తినిపించిన దాసరి :

సరిగ్గా అదే సమయానికి దాసరి ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన వేటూరి అసహనాన్ని ఆయన చెత్త బుట్టలో వేసిన పాట గురించి తెలుసుకున్నారు. ఏదీ ఆ పాట నాకు ఇవ్వండి అని అడిగారు దాసరి. అయితే అది పనికి రాని పాట అంటూ వేటూరి చెప్పారట. కానీ దాసరి మాత్రం ఆ పాటను తన అసిస్టెంట్ల ద్వారా బయటకు తీయించారు. పాట మొత్తం చదివిన దాసరికి ఆ పాట ఎంతగానో నచ్చింది. వారికి నచ్చకపోతే ఏమైంది, నా సినిమాలో వాడుకుంటాను అని దాసరి అనడంతో వేటూరి సహా అంతా షాక్ తిన్నారుట. ఆ తరువాత వేటూరి ముఖంలో నవ్వులు విరబూసాయి.

కట్ చేస్తే సూపర్ హిట్ :

ఇంతకీ ఆ పాట ఏంటి అంటే తొలి సంధ్యకు తూరుపు ఎరుపు, మలి సంధ్యకు పడమర ఎరుపు అంటూ సాగే పల్లవితో వచ్చే పాట. ఈ పాటను దాసరి తాను తీసిన కన్యా కుమారి మూవీలో వినియోగించారు. మరో విశేషం ఏంటి అంటే ఈ పాటకు సంగీత బాణీలు సమకూర్చిన వారు ప్రఖ్యాత నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన గాయకుడిగా దూసుకుని పోతున్న తరుణంలో ఆయనని కన్యా కుమారి మూవీ ద్వారా సంగీత దర్శకుడిగా చేసిన ఘనత దాసరికే దక్కుతుంది. అలా వేటూరి రాసి పారేసిన పాటకు ఎస్పీబీ ట్యూన్ కడితే అది ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ అయి కూర్చుంది. సినీ సీమలో ఇలాంటి తమాషాలు కోకొల్లలు. జనాల టెస్ట్ ఎలా ఉందో బయటకు సినిమా కానీ పాటలు కానీ వచ్చేంతవరకూ తెలియదు, జనాలకు ఫలానాదే నచ్చుతుందని అనుకుంటూంటారు. కానీ అది చాలా సార్లు అంచనా తప్పుతుంది కూడా.