అవార్డులు కాదు పాన్ ఇండియా హిట్టు కావాలి
సూర్య లాంటి పెర్ఫామర్ తో జాతీయ అవార్డ్ గ్రహీత వేట్రిమారన్ ఓ సినిమా చేస్తున్నారు అంటే కచ్ఛితంగా దానిపై అంచనాలుంటాయి.
By: Tupaki Desk | 19 May 2025 11:45 AM ISTసూర్య లాంటి పెర్ఫామర్ తో జాతీయ అవార్డ్ గ్రహీత వేట్రిమారన్ ఓ సినిమా చేస్తున్నారు అంటే కచ్ఛితంగా దానిపై అంచనాలుంటాయి. అభిమానుల్లో ఎప్పటికప్పుడు ఎగ్జయిట్ మెంట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్సుకత నిలవనీయదు.
అలాంటి ఉత్సాహంతో వేట్రిమారన్ ని ఒక ప్రశ్న అడిగారు అభిమానులు. కానీ అతడి సమాధానం నిజంగా నిరాశపరిచింది. దర్శకుడు వెట్రిమారన్ తదుపరి సూర్య కథానాయకుడిగా `వాడివాసల్` కోసం చాలా కాలంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమా చాలా సంవత్సరాలుగా స్క్రిప్టు డెవలప్ మెంట్ దశలో ఉంది. ఎట్టకేలకు ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని వెట్రిమారన్ ప్రకటించారు. సూర్య కూడా అభిమానులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసే ఆలోచనా ఉంది.
ఇటీవల ఓ కార్యక్రమంలో సూర్యతో `వాడివాసల్`పై ఉన్న భారీ అంచనాల గురించి వెట్రిమారన్‌ను ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ ఈ అంచనాలకు నేను బాధ్యత వహించను అని అన్నారు. అభిమానుల ఆశలకు తగ్గట్టుగా ఉంటే నేను సంతోషిస్తాను. కానీ అంచనాలకు నేను బాధ్యత వహించలేను. నేను చేసే ప్రతి సినిమాకు 100 శాతం కృషి చేస్తాను అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. స్టార్ హీరో సూర్య తదుపరి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఒక సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఆ తర్వాతే `వాడివాసల్` చిత్రీకరణ ప్రారంభించడానికి తేదీలు కేటాయిస్తారు. ఆర్.జే బాలాజీతోను సూర్య ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వేట్రిమారన్ అయినా, ఇతర దర్శకులు అయినా సూర్యకు ఇప్పుడు పాన్ ఇండియా హిట్టు కావాలి. కంగువతో ప్రయత్నించినా కానీ అది పాకిస్తానీ మిసైల్ లా మిస్ ఫైరైంది.
