దూకుడు... వెన్నెల కిషోర్ లైపో సర్జరీ!!
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. ఆయన కమెడియన్‌గానే కాకుండా లీడ్ రోల్స్‌లోనూ నటిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం.
By: Tupaki Desk | 13 May 2025 2:30 PMప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. ఆయన కమెడియన్‌గానే కాకుండా లీడ్ రోల్స్‌లోనూ నటిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో వెన్నెల కిషోర్ నటించిన సింగిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటిలాగే తన కామెడీతో సింగిల్ సినిమాలో నవ్వించాడు. తనదైన శైలి మేనరిజంతో నవ్విస్తూ ఉండే వెన్నెల కిషోర్ చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. ఆయన వ్యక్తిగత విషయాలను చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌లోని పలు ఆసక్తికర సంఘటనలు, విశేషాలను గురించి పంచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.
2005లో వెన్నెల సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కిషోర్ ఆ తర్వాత వెన్నెల కిషోర్‌గా మారిన విషయం తెల్సిందే. మొదటి సినిమా నుంచి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వెన్నెల కిషోర్‌కి మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాతో మంచి అవకాశం దక్కింది. దూకుడు తర్వాత వెన్నెల కిషోర్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఏడాదికి డజన్ల కొద్ది సినిమాలు చేస్తూ వచ్చిన వెన్నెల కిషోర్ కెరీర్ ఆరంభంలో కాస్త విమర్శలు, ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడట. ఆ విషయాన్ని స్వయంగా వెన్నెల కిషోర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మహేష్ బాబుతో కలిసి దూకుడు సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న వెన్నెల కిషోర్ షూటింగ్ ప్రారంభంకు ముందు బరువు తగ్గాలని దర్శకుడు శ్రీనువైట్ల సూచించాడట. అందుకోసం లైపో సర్జరీ చేయించుకోవాలని సూచించాడట. మహేష్ బాబు సన్నగా ఉంటాడు కనుక, ఆయన పాత్రకు మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలంటే బరువు తగ్గాల్సిందే అని శ్రీను వైట్ల చెప్పాడట. కొన్ని రోజులు టెస్ట్ షూట్ చేసిన తర్వాత లావుగా ఉంటేనే బాగున్నావు, ఇలాగే కంటిన్యూ చేద్దాం అని శ్రీను వైట్ల అన్నారట. దాంతో లైపో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం రాలేదని వెన్నెల కిషోర్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. దూకుడు తర్వాత వెన్నెల కిషోర్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా మారిన విషయం తెల్సిందే.
టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల నుంచి కూడా వెన్నెల కిషోర్‌కి ఆఫర్లు వస్తూ ఉంటాయట. కానీ ఆచితూచి వ్యవహరిస్తూ సినిమాలను ఎంపిక చేసుకోవడంతో ఇతర భాషల్లో ఎక్కువగా కనిపించలేదు. దర్శకుడిగానూ వెన్నెల కిషోర్ తన అదృష్టంను పరీక్షించుకున్నాడు. కానీ ఫలితం దక్కలేదు. హీరోగా ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం వచ్చినా కమెడియన్ పాత్రలను మాత్రం వదిలి పెట్టడం లేదు. ముందు ముందు వెన్నెల కిషోర్ మరిన్ని కామెడీ సినిమాలు చేయడం మాత్రమే కాకుండా, మంచి కథ లభిస్తే సీరియస్ రోల్స్ కూడా చేసేందుకు సిద్ధం అంటున్నాడు.