Begin typing your search above and press return to search.

వెన్నెల కిషోర్‌ను సరిగ్గా వాడుకున్నారు

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు కామెడీ వైభవం ఎలా ఉండేదో తెలిసిందే. పదుల సంఖ్యలో కమెడియన్లు నవ్వుల పంట పండించేవారు

By:  Tupaki Desk   |   12 Feb 2024 11:30 PM GMT
వెన్నెల కిషోర్‌ను సరిగ్గా వాడుకున్నారు
X

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు కామెడీ వైభవం ఎలా ఉండేదో తెలిసిందే. పదుల సంఖ్యలో కమెడియన్లు నవ్వుల పంట పండించేవారు. కానీ మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్.. ఇలా గొప్ప గొప్ప కమెడియన్లు ఒక్కొక్కరుగా కాలం చేశారు. సునీల్ కామెడీ మానేశాడు. దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన బ్రహ్మానందం జోరు కూడా తగ్గిపోయింది.

మరోవైపు జబర్దస్త్.. తెలుగు సినిమాల్లో కామెడీ ప్రభావాన్ని మరింత తగ్గించేసింది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడీ సినిమాలు కరువైపోయాయి. ఐతే ఇప్పటికీ మంచి క్యారెక్టర్లు పడితే కడుపుబ్బ నవ్వించే కమెడియన్లలో ఒకరు వెన్నెల కిషోర్. కానీ కిషోర్‌ను కూడా ఈ మధ్య సినిమాల్లో సరిగా వాడుకోవట్లేదనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది. గత ఏడాది ‘సామజవరగమన’ లాంటి కొన్ని సినిమాల్లో కిషోర్ అదరగొట్టాడు. కానీ అతడి క్యారెక్టర్లు ఫుల్ లెంగ్త్‌లో ఉండట్లేదన్నది ఫ్యాన్స్ కంప్లైంట్.

ఐతే వెన్నెల కిషోర్‌ను ఇప్పుడు పూర్తిగా వాడుకునే సినిమా ఒకటి వస్తోంది. అదే.. చారి 111. కిషోర్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న సినిమా ఇది. మార్చి 1న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయింది. అది చూస్తే ‘చారి 111’ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. బయో ఎటాక్స్‌కు ప్లాన్ చేసిన దుర్మార్గుల ఆట కట్టించే సీక్రెట్ ఏజెంట్ పాత్రను కిషోర్ ఇందులో పోషించడం విశేషం.

కిషోర ఏంటి.. దేశద్రోహుల ఆట కట్టించడం ఏంటి.. కిషోర్‌తో ఇంత సీరియస్ సినిమానా అని ఆశ్చర్యం కలగొచ్చు. ఐతే ఇక్కడ ఆపరేషన్ సీరియసే కానీ.. అందులో ముఖ్య పాత్ర పోషించే ఏజెంట్ పాత్ర మాత్రం కామెడీదే. సీరియస్ ఆపరేషన్లో ఒక సిల్లీ ఏజెంట్ చేసే విన్యాసాలే ఇందులో హైలైట్. ట్రైలర్లో కిషోర్ పాత్ర, అతడి పెర్ఫామెన్స్, డైలాగులు అన్నీ కూడా హిలేరియస్‌గా అనిపించాయి. ముఖ్యంగా ‘‘నువ్వు ఎప్పటికీ కమెడియన్‌వే, హీరోవి కాదు’’ అనే లాస్ట్ పంచ్ భలే పేలింది. ట్రైలర్ చూస్తే సినిమా కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తోంది. కీర్తి కుమార్ డైరెక్ట్ చేశాడీ చిత్రాన్ని.