సూర్య చేసింది తెలుగు సినిమా కాదు
ఐతే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఆ కోరిక తీరిపోతోందని అంతా అనుకున్నారు.
By: Garuda Media | 25 July 2026 3:08 PM ISTతమిళ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చినపుడల్లా.. తెలుగులో సినిమా చేయాలనుందని.. త్వరలోనే చేస్తామని అంటూనే ఉంటారు. ఐతే ఆ మాట నిలబెట్టుకున్న వాళ్లు తక్కువమంది. తెలుగులో ఇక్కడి స్టార్లతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించిన సూర్య.. ‘రక్తచరిత్ర-2’లో విలన్ పాత్ర చేశాడే తప్ప హీరోగా మాత్రం ఇక్కడ సినిమా చేయలేదు.
ఐతే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఆ కోరిక తీరిపోతోందని అంతా అనుకున్నారు. కానీ ఇది అందరూ అనుకుంటున్నట్లుగా తెలుగు సినిమా కాదని.. డబ్బింగ్ సినిమా అని వెంకీ అట్లూరి క్లారిటీ ఇచ్చాడు. తాను ఇంతకుముందు ధనుష్‌తో తీసిన ‘సార్’ చిత్రాన్ని ఒకేసారి తెలుగులో, తమిళంలో తెరకెక్కించామని.. కానీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు మాత్రం అలా చేయలేదని చెప్పాడు వెంకీ. ఈ సినిమాను తమిళంలోనే తీసి తెలుగులోకి డబ్ చేసినట్లు వెల్లడించాడు. ఉద్దేశ్వపూర్వకంగానే ఇలా చేశామని.. సూర్యతో తాను ప్రాపర్ తమిళ సినిమా తీయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశానని వెంకీ తెలిపాడు.
ఇక ‘కరుప్పు’ సినిమా టైంలో ఇది పూర్య కమ్ బ్యాక్ అని పేర్కొనడం పట్ల వెంకీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘24’ సినిమా తెలుగులో చాలా బాగా ఆడిందని, ఇక్కడది సూపర్ హిట్ అని.. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చిందని.. ఓటీటీలో రిలీజైనంత మాత్రాన అవి సక్సెస్ ఫుల్ సినిమాలు ఎలా కాకుండా పోతాయని అతనన్నాడు.
తన చివరి రెండు సినిమాలు సార్, లక్కీ భాస్కర్ సీరియస్‌గా వెళ్లాయని.. సూర్యతో ఒక సంతోషకరమైన ఫ్యామిలీ సినిమా తీయాలన్న ఉద్దేశంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథను ఎంచుకున్నానని వెంకీ తెలిపాడు. తన తొలి సినిమా తర్వాత వరుసగా రెండు చిత్రాలు నిరాశపరిచాయని.. అయినా నిర్మాత నాగవంశీ తనను నమ్మి పెద్ద బడ్జెట్లలో సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు తీయడం చిన్న విషయం కాదని, ఇందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని వెంకీ వ్యాఖ్యానించాడు.
